Manipur: మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్ సీఎం కీలక ప్రకటన
ABN, First Publish Date - 2023-07-20T21:22:57+05:30
పట్టపగలు కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ (Biren singh) స్పందించారు. అవనుషమైన ఈ ఘటనతో సంబంధమున్న మరో వ్యక్తిని పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశామని ప్రకటించారు. వీడియో చూసిన తర్వాత ఈ హేయమైన నేరాన్ని ఖండించాలని నిర్ణయించామని అన్నారు. మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించారు.
ఇంఫాల్ : పట్టపగలు కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం చర్చనీయాంశమైన నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ (Biren singh) స్పందించారు. అవనుషమైన ఈ ఘటనతో సంబంధమున్న మరో వ్యక్తిని పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశామని ఆయన ప్రకటించారు.
‘‘ వీడియో చూసిన తర్వాత ఈ హేయమైన నేరాన్ని ఖండించాలని నిర్ణయించాం. మానవత్వంపై జరిగిన నేరంగా పేర్కొంటున్నాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో ప్రమేయమున్నవారిని అరెస్ట్ చేస్తాం. చట్టాల ప్రకారం కేసులు పెడతాం’’ అని బిరెన్ సింగ్ ప్రకటించారు. నేరానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని అన్నారు. మహిళలు, సోదరీమణులు, పెద్దవారిపై ఇదే చివరి నేరం అవ్వాలని అభ్యర్థించారు. అక్కాచెల్లెల్లు, అమ్మలు, పెద్దలకు కచ్చితంగా గౌరవం ఇచ్చితీరాలని పిలుపునిచ్చారు. ఈ అమానవీయ చర్యపై దేశవ్యాప్తంగా అగ్రహజ్వాలలు వ్యక్తమవుతుండడం, దాదాపు 70 రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీఎం బిరెన్ సింగ్ స్వయంగా స్పందించారు.
కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఉదయం అరెస్ట్ చేసిన వ్యక్తితో కలిపి ఇప్పటివరకు మొత్తం నలుగురు అరెస్టయ్యారని వివరించారు. వీడియో వైరల్‌గా మారిన తర్వాత 32 ఏళ్ల హీరాదాస్‌ను థౌబల్ జిల్లాలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీడియోలో అతడు పచ్చరంగు టీషర్ట్ వేసుకొని మహిళను ఈడ్చుతున్నాడని చెప్పారు.
కాగా మహిళలను నగ్నం ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నాంగ్‌పోక్ సెక్మాయ్ సమీపంలో మే 4న జరిగింది. ఇద్దరు బాధితులను దుండగులు హతమార్చినట్లు పోలీసుల ఎఫ్‌ఐఆర్ స్పష్టం చేస్తోంది. ‘‘మే 4న మైతేయిలు అత్యంత పాశవికంగా కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించారు. సాయుధులైన యువకులు దారిపొడవునా వారి మర్మావయవాలను తడుముతూ పైశాచికానందం పొందారు. ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల గుర్తింపు(ఐడెంటిటీ) తెలిసేలా.. ఉద్దేశపూర్వకంగా వీడియోను విడుదల చేశారు’’ అని ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ఐటీఎల్‌ఎఫ్) ఆరోపించింది. బాధిత మహిళలు కుకీ-జో తెగకు చెందినవారని ఐటీఎల్‌ఎఫ్ వెల్లడించింది.
Updated Date - 2023-07-20T21:23:13+05:30 IST