Manipur : ఇరవయ్యేళ్ల తర్వాత మణిపూర్‌లో హిందీ సినిమా ప్రదర్శన
ABN, First Publish Date - 2023-08-15T14:54:39+05:30
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు మణిపూర్‌లో ఓ ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తిని కోరుకుంటున్న యువత ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించబోతున్నారు.
ఇంఫాల్ : హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు మణిపూర్‌లో ఓ ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తిని కోరుకుంటున్న యువత ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించబోతున్నారు. ఈ రాష్ట్రంలో హిందీ సినిమాను ప్రదర్శించడం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి కాబోతోంది.
గిరిజన సంఘం హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సోమవారం రాత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, చురాచాంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లామ్కా)లో మంగళవారం సాయంత్రం ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శిస్తారు. అయితే ఈ సినిమా పేరును ఈ సంఘం వెల్లడించలేదు. గిరిజనులను ఉగ్రవాద సంస్థలు దశాబ్దాల నుంచి అణచివేస్తున్నాయని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తమ ధిక్కార ధోరణిని వ్యక్తం చేయడానికే తాము హిందీ సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించినట్లు ఈ సంఘం తెలిపింది. స్వాతంత్ర్యం, న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తాము చేస్తున్న శపథంలో అందరూ పాలుపంచుకోవాలని కోరింది.
మణిపూర్‌లో ప్రదర్శించిన చిట్టచివరి హిందీ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’ అని, దీనిని 1998లో ప్రదర్శించారని తెలిపింది. దేశ వ్యతిరేక ఉగ్రవాద సంస్థల నుంచి స్వాతంత్ర్యాన్ని తాము ప్రకటిస్తున్నామని చెప్పింది. ఈ ఉగ్రవాద సంస్థలు స్వాతంత్ర్య దినోత్సవాలను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేసింది.
రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శనను రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ 2000లో నిషేధించింది. నిషేధం విధించిన వారం రోజుల్లోనే దాదాపు 8,000 హిందీ ఆడియో, వీడియో సీడీలను ఉగ్రవాదులు తగులబెట్టారు. అయితే ఈ నిషేధానికి కారణమేమిటో ఈ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి :
Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ
Independence Day : మధ్య తరగతి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి : మోదీ
Updated Date - 2023-08-15T14:54:39+05:30 IST