Manipur files: మణిపూర్ అల్లర్లు.. కుప్పలుగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు
ABN, First Publish Date - 2023-07-25T03:07:57+05:30
రెండు జాతుల మధ్య వైరంతో కల్లోలితంగా మారిన మణిపూర్(Manipur) రాష్ట్రంలో పోలీసుల ముందు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండున్నర నెలలుగా జరుగుతున్న హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఆరు వేలకు పైగా నమోదు
ఆ కేసుల దర్యాప్తు
తలకు మించిన భారమే
పోలీసుల్లోనూ కుకీ,
మైతేయీ వర్గాల విభజన!!
(సెంట్రల్ డెస్క్): రెండు జాతుల మధ్య వైరంతో కల్లోలితంగా మారిన మణిపూర్(Manipur) రాష్ట్రంలో పోలీసుల ముందు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండున్నర నెలలుగా జరుగుతున్న హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే.. ఆ కేసులన్నీ సంబంధిత ఠాణాల్లో రిజిస్టరైనవి కాదు. నేరం ఒక చోట జరిగితే.. మరో ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదైన కేసులవి..! ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరువేలకు పైగా జీరో ఎఫ్‌ఐఆర్( zero FIRs)లు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత ఠాణాలకు బదిలీ చేయడం ఒక టాస్క్ అయితే.. ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు దర్యాప్తును ప్రారంభించడం మరో ఎత్తు..! ఇందుక్కారణం, ఈ అల్లర్లలో బాధితులైన కుకీలు.. తమ వర్గం పోలీసుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఠాణాలోనే ఫిర్యాదులు చేస్తున్నారు. మైతేయీ వర్గం బాధితులు కూడా అదే పంథాలో నడుస్తున్నారు.
ఫిర్యాదు చేయడమే గగనం
మణిపూర్‌లో మే 3న ఇరు వర్గాల మధ్య అల్లర్లు ప్రారంభమవ్వగా.. ఆ తర్వాతి రోజు ఇద్దరు కుకీ మహిళలను(Cookie women) నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే! బాధిత మహిళలిద్దరూ వారం రోజుల తర్వాత తమ వారిని కలుసుకున్నారు. వారి సాయంతో మే 16న కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఠాణా(సైకుల్ పోలీస్ స్టేషన్)లో ఫిర్యాదు చేశారు. ఆ జీరో ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే సంబంధిత ఠాణా(నాంగ్‌పోక్ సెక్మాయ్)కు కేసు బదిలీ చేశారు. నాంగ్‌పోక్‌సెక్మాయ్ పోలీసులు మాత్రం జూన్ 21న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఠాణా ఉన్న తౌబాల్ జిల్లా(Taubal District)లో మైతేయీ వర్గం పోలీసుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సైకుల్ ఠాణాలో 202 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం గమనార్హం. కార్ల షోరూంలో పనిచేసే ఇద్దరు కుకీ మహిళల కిడ్నాప్, హత్య కేసులోనూ అంతే..! బాధితుల తరఫువారు కుకీ పోలీసులు అధికంగా ఉండే ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్ చేయించారు. ఇలా వేర్వేరు ఠాణాల్లో ఆరు వేలకు పైగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. వాటిని సంబంధిత ఠాణాలకు బదిలీ చేసినా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సినవి చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తొలినాళ్లలో 50 వేల మంది దాకా మైతేయీలు నిరాశ్రయులయ్యారు. వారు కూడా తమకు అనుకూలంగా ఉన్న ఠాణాల్లోనే జీరో ఎఫ్‌ఐఆర్‌లు చేయించారు. ఇలా ఇరువర్గాలు తమవారు ఎక్కువగా విధుల్లో ఉండే ఠాణాలను ఆశ్రయిస్తున్నారు. తమ వైరివర్గం తెగవారు ఎక్కువగా ఉండే ఠాణాల్లో తమ ఫిర్యాదులు బుట్టదాఖలయ్యే ప్రమాదముందనే అనుమానాల వల్లే ఇలా జీరో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. అల్లర్లు ఎక్కువగా జరిగిన ఒక్క చురాచాంద్‌పూర్ ఠాణాలోనే 1,700 జీరో నమోదయ్యాయి. ఇంఫాల్ పరిసరాల్లో నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్ కేసులన్నీ మైతేయీ తెగ వారు చేసిన ఫిర్యాదులకు సంబంధించినవే.
జీరో ఎఫ్‌ఐఆర్ అంటే?
2012లో ఢిల్లీలో నిర్భయ కేసు(Nirbhaya case in Delhi) తర్వాత.. కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ వర్మ కమిటీ(Justice Verma Committee) జీరో ఎఫ్‌ఐఆర్‌ను ప్రతిపాదించింది. దాని ప్రకారం నేరం ఎక్కడ జరిగిందనేదానితో సంబంధం లేకుండా.. బాధితులు తమకు అందుబాటులో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఆ తర్వాత కేసును సంబంధిత ఠాణాకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
Updated Date - 2023-07-25T07:01:05+05:30 IST