JDS Alliance MIM : జేడీఎస్‌తో ఎంఐఎం పొత్తు?
ABN, First Publish Date - 2023-04-05T02:24:12+05:30
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష జేడీఎ్‌సతో ఈ పార్టీ పొత్తు
25 స్థానాల్లో పోటీకి సిద్ధం.. 3 సీట్లలో అభ్యర్థుల ప్రకటన
మా రిజర్వేషన్లు తీసేసినప్పుడు సెక్యులర్ పార్టీలు ఏమయ్యాయి?
మేం ముస్లిం ఓట్లు చీలుస్తామనడం అర్థరహితం: అసదుద్దీన్ ఫైర్
బెంగళూరు, ఏప్రిల్ 4: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష జేడీఎ్‌సతో ఈ పార్టీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని ఎంఐఎం కర్ణాటక అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ చెప్పుకొచ్చారు. జేడీఎ్‌సతో చర్చలు జరుపుతున్నామని, దేవెగౌడతోనూ సంప్రదింపులు చేస్తున్నామని, అయితే.. ఇంకా కొలిక్కిరాలేదని తెలిపారు. ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ముగ్గురికి టికెట్లు ఇచ్చామన్నారు. అదేవిధంగా పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఖాయం. అయితే, అది పొత్తులతోనా, ఒంటరిగానా.. అనేది వేచి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పొత్తు కోరుకోవడం లేదు. ఆ పార్టీ నేతలు నాపై నిరాధార ఆరోపణలు చేశారు’’ అని ఒవైసీ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు 4ు రిజర్వేషన్లు రద్దు చేయడాన్ని పూర్తి చట్ట విరుద్ధమని ఒవైసీ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సెక్యులర్ నాయకులుగా చెప్పుకొనేవారు, పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం పోటీ చేస్తోందనే విమర్శలను ఒవైసీ తోసిపుచ్చారు. లింగాయత్‌లు, వక్కలిగలు, కురబల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉన్నామని, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటును గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. ఇది ముస్లిం ఓట్ల విభజనతో జరిగిందా? లేక మెజారిటీ ఓట్లను బీజేపీ ఏకీకృతం చేయడంతో జరిగిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు దారుల కారణంగానే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. కాగా, 2018 ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దూరంగా ఉండి, జేడీఎ్‌సకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
‘వరుణ’ సీటుపై వారిది దొంగాట: దేవెగౌడ
కీలకమైన వరుణ అసెంబ్లీ నియోజకవర్గం స్థానంపై మాజీ సీఎంలు బీజేపీ నేత యడియూరప్ప, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య దొంగాట ఆడుతున్నారని జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడ విమర్శలు గుప్పించారు. వరుణ స్థానం నుంచి తన కుమారుడు పోటీకి దిగబోడని యడియూరప్ప ఎందుకు చెప్పలేక పోతున్నారని ప్రశ్నించారు. ‘హసన్’ సీటు వివాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిని తాము పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ మాజీ సీఎంలు ఒక అవగాహనతో ఉన్నప్పుడు.. తానేం చెబుతానని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాదు: బొమ్మై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం అసాధ్యమని బీజేపీ నేత, సీఎం బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. తానంటే తానే ముఖ్యమంత్రి అయిపోతానని, రాష్ట్ట్రంలో చక్రం తిప్పుతానని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య కంటున్న కలలు ఫలించబోవన్నారు. కాంగ్రెస్ నేతలకు అధికారంమీద, ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు.
కుటుంబంలో ఒక్కరికే టికెట్
కర్ణాటక ఎన్నికల కదనరంగంలోకి దూకాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఎంపీలకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వకూడదని, ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలని బెంగళూరులో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన తర్వాతే ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
నా భార్య పోటీ చేయదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కుమారస్వామి స్పష్టీకరణ
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య అనిత పోటీ చేసే ప్రసక్తే లేదని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి తేల్చిచెప్పారు. హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీకి హాసన్ టికెట్ లభించిన పక్షంలో తుమకూరు రూరల్ టికెట్ తనకు ఇవ్వాలని అనిత డిమాండ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను కుమారస్వామి తోసిపుచ్చారు. ‘అనితకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తే లేదు. వాటికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. గతంలో కొన్ని కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులు లేని సమయంలో పార్టీని కాపాడేందుకే అనిత పోటీ చేశారు. అలా మూడుసార్లు ఆమె పోటీ చేయాల్సి వచ్చింది. మరోసారి పోటీచేయాలనే ఆసక్తి ఆమెకు లేదు’ అని ఆయన వివరించారు.
Updated Date - 2023-04-05T02:24:12+05:30 IST