Morbi Bridge Collapse: ఓరేవా గ్రూప్ ఎండీకి చుక్కెదురు..
ABN, First Publish Date - 2023-03-07T18:43:53+05:30
గుజరాత్‌లో ఇటీవల కుప్పకూలిన మోర్బి బ్రిడ్జి విషాద ఘటనలో ఓరేవా గ్రూప్ ఎండీ ..
గాంధీనగర్: గుజరాత్‌లో ఇటీవల కుప్పకూలిన మోర్బి బ్రిడ్జి (Morbi Bridge Collapse) విషాద ఘటనలో ఓరేవా గ్రూప్ (Oreva group) ఎండీ జేసుఖ్ పటేల్ (Jaysukh Patel)కు చుక్కెదురైంది. ఆయనకు తాత్కాలిక బెయిలు ఇచ్చేందుకు జిల్లా అండ్ సెషన్స్ కోర్ట్స్ మంగళవారంనాడు నిరాకరించింది. గత ఏడాది మోర్బి వంతెన కూలిపోయిన ఘటనలో 135 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని జేసుఖ్ పటేల్ ఇటీవల వేసిన పిటిషన్‌ను గుజరాత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారికి సాయం అందించే ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 15 నుంచి 20 రోజులు తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని జేసుఖ్ కోరారు. అయితే, పరిహారం ఇవ్వడానికి ఆయనే స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫు ప్రాసిక్యూటర్ వాదించారు.
మోర్బి వంతెన గత ఏడాది అక్టోబర్ 30న వంతెన కూలిపోవడానికి ముందు ఆ వంతెన నిర్వహణ బాధ్యతలను ఓరేవా గ్రూప్ చూసేది. దీనిపై గుజరాత్ హైకోర్టు గత ఫిబ్రవరి 22న ఆదేశాలు ఇచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున తాత్కాలిక పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ, ఇందుకు నాలుగు వారాలు గడువు విధించింది. జేసుఖ్ తాత్కాలిక బెయిల్ అభ్యర్థనను బాధిత కుటుంబాల సభ్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత శనివారంనాడు వ్యతిరేకించింది. దీంతో తీర్పును సెషన్స్ జడ్జి పీసీ జోషి మార్చి 7వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా బెయిల్ అభ్యర్థనను నిరాకరిస్తూ ఆయన తీర్పు వెలువరించారు.
Updated Date - 2023-03-07T18:43:53+05:30 IST