CM Shivraj singh: సీఎం కుర్చీ నా లక్ష్యం కాదు, కానీ...
ABN, First Publish Date - 2023-12-05T17:35:04+05:30
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తారా, కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడూ తన లక్ష్యం కాదని మంగళవారంనాడు తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)ను కొనసాగిస్తారా, కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడూ తన లక్ష్యం కాదని మంగళవారంనాడు తెలిపారు. సుదీర్ఘ కాలం మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన క్రెడిట్‌ను శివరాజ్ దక్కించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 163 సీట్లతో బీజేపీ అఖండ విజయం నమోదు చేసుకోవడంతో మరోసారి ఆయన పేరు మార్మోగిపోతోంది.
శివరాజ్ సింగ్ చౌహాన్ (64)ను సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించనప్పటికీ ఆయన తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. 'లాడ్లీ బెహ్నా' వంటి పథకంతో ఒక్కసారిగా ఓట్ల ప్రభంజనం సృష్టించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనను సీఎంగా పార్టీ ప్రకటించనుందా అనే ప్రశ్నకు నవ్వుతూ ఆయన సమాధానమిచ్చారు. ''రేపు నేను ఢిల్లీకి వెళ్లడం లేదు. ఛింద్వారా వెళ్తు్న్నాను. అక్కడ 7 విధాన సభ సీట్లు ఉండగా, మొత్తం అన్నింటినీ మేము గెలుచుకోలేకపోయాం. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 29 ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలో పడాలని నేను బలంగా తీర్మానించుకున్నాను'' అని ఆయన అన్నారు.
సీఎం రేసులో..
కాగా, నవంబర్ 17న ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థి ఎవరనేది బీజేపీ ప్రకటించలేదు. ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించడంతో లోక్‌సభ ఎన్నికల వరకూ చౌహాన్‌నే సీఎంగా కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టడటంతో వీరిలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా జ్యోతిరాధిత్య సింధియా, కైలాష్ విజయవర్గీయ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
Updated Date - 2023-12-05T17:35:06+05:30 IST