Uttarakhand tunnel rescue: 70 గంటలు గడిచినా వీడని ఉత్కంఠ.. కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన
ABN, First Publish Date - 2023-11-15T13:18:05+05:30
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రిస్క్యూ టీమ్‌లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ (Tunnel) ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రిస్క్యూ టీమ్‌లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది. దీంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది.
సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడానికి సొరంగం లోపల 900 ఎంఎం పైపును అమర్చడం ద్వారా మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం మూడు రోజులుగా జరుగుతోంది. టన్నెల్‌ను బ్లాక్ చేసిన 21 మీటర్ల శ్లాబ్‌ను తొలగించినప్పటకీ, 19 మీటర్ల పాసేజ్‌ను ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన కొత్త డ్రిల్లింగ్ మిషన్, ఇతర సామగ్రిని న్యూఢిల్లీ నుంచి ఎయిర్ లిఫ్ట్ ద్వారా రప్పించే చర్చలు చేపట్టారు.
దీనికి ముందు, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులందరినీ బుధవారం కల్లా సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ఉత్తరాఖండ్ జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ రుహెలా చెప్పారు. అయితే, మంగళవారం రాత్రి తిరిగి కొండచరియలు విరిగిపడటంతో కొత్త డ్రిల్లింగ్ మిషన్‌తో తిరిగి పనులు చేపట్టబోతున్నట్టు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) తెలిపింది. దీంతో సహాయక పనుల్లో జరుగుతున్న జరుగుతున్న జాప్యంతో పలువురు కార్మికుల కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాకీటాకీతో రెస్క్యూ సిబ్బంది సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడామని, సుమారు ఐదు నుండి ఆరు రోజులు జీవించేందుకు సొరంగం విభాగంలో తగినంత ఆక్సిజన్ ఉందని ఎస్‌డీఆర్ఎఫ్ అధికారి రంజిత్ కుమార్ సిన్హా చెబుతున్నారు.
Updated Date - 2023-11-15T13:18:07+05:30 IST