Odisha Train Crash: మృతదేహాలు ఉంచిన పాఠశాల భవనం కూల్చివేత
ABN, First Publish Date - 2023-06-09T14:57:06+05:30
ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి మృతదేహాలను తాత్కాలికంగా ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలను శుక్రవారంనాడు కూల్చివేశారు. ఈనెల 2న మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా, పలు మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా గతవారం బాలాసోర్‌లోని బహనాగ హైస్కూలులో తాత్కాలికంగా ఉంచారు.
భువనేశ్వర్: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి మృతదేహాలను తాత్కాలికంగా ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలను శుక్రవారంనాడు కూల్చివేశారు. ఈనెల 2న మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా, పలు మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా గతవారం బాలాసోర్‌లోని బహనాగ హైస్కూలులో తాత్కాలికంగా ఉంచారు. అనంతరం పాఠశాల గదులను శానిటైజ్ చేశారు. అయినప్పటికీ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, వారిని పంపేందుకు తల్లిదండ్రులు అయిష్టం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, పాఠశాల భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని కోరింది. పాఠశాల భవనం నిర్మించి 65 ఏళ్లు అయినందున ఆ భవనం ఇంకెంత మాత్రం సురక్షితం కూడా కాదని తెలిపింది.
దీనిపై బహనాగా హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు ప్రమీళ స్వాయిన్ మీడియాతో మాట్లాడుతూ, పాఠశాలకు రావాలంటేనే చిన్నపిల్లలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. వారి భయాలను పోగెట్టేందుకు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించామన్నారు. రైలు ప్రమాదం అనంతరం పలువురు సీనియర్ విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు కూడా సహాయక కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు.
పాఠశాలను దర్శించిన కలెక్టర్
కాగా, బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ బవుసాహెబ్ షిండే ఈ పాఠశాలను గురువారంనాడు సందర్శించారు. పాఠశాల మేనేజిమెంట్ కమిటీ, ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది, స్థానికులను తాను కలుసుకున్నానని, పాత భవనాన్ని కూలగొట్టి, కొత్తభవనం కట్టడం వల్ల తిరిగి క్లాసులకు వచ్చేందుకు పిల్లలకు ఎలాంటి భయాలు ఉండవని వారు తెలియజేశారని చెప్పారు. పాఠశాల కూల్చేయాలని కమిటీ తీర్మానం చేస్తే ఆ భవంతిని కూల్చేస్తామని వివరించారు. పాఠశాల భవనం కూల్చివేతకు కమిటీ వెంటనే తీర్మానం చేయడంతో పాఠశాల కూల్చివేత పనులు శుక్రవారం మొదలయ్యాయి. ఒడిశాలో పాఠాశాలలు వేసవి సెలవులు అనంతరం జూన్ 19న తిరిగి ప్రారంభమవుతున్నాయి.
Updated Date - 2023-06-09T16:12:29+05:30 IST