Ola Employee Bijlee: జాక్‌పాట్ కొట్టిన కుక్క.. ఓలా కంపెనీలో ఉద్యోగం.. మనసు దోచేసిన సీఈవో
ABN, First Publish Date - 2023-08-01T16:51:03+05:30
ఈ భూమండలంలో ఉన్న జీవరాసుల్లో కుక్కలు అత్యంత విశ్వాస పాత్రమైన జంతువులని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఒక్కసారి వారి పట్ల కాస్త ప్రేమ చూపిస్తే చాలు.. అవి జీవితాంతం రుణపడి ఉంటాయి. 100 రెట్ల ప్రేమను తమ యజమానిపై చూపిస్తాయి. నేస్తంలా తోడుగా ఉంటూ..
ఈ భూమండలంలో ఉన్న జీవరాసుల్లో కుక్కలు అత్యంత విశ్వాస పాత్రమైన జంతువులని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఒక్కసారి వారి పట్ల కాస్త ప్రేమ చూపిస్తే చాలు.. అవి జీవితాంతం రుణపడి ఉంటాయి. 100 రెట్ల ప్రేమను తమ యజమానిపై చూపిస్తాయి. నేస్తంలా తోడుగా ఉంటూ.. ఆపద వచ్చినప్పుడల్లా తమ యజమానిని కాపాడటంలో ముందుంటాయి. అందుకే.. జంతుప్రేమికులకు కుక్కలంటే చాలా ఇష్టం. అవి చూపించే విశ్వాసానికి ప్రతిఫలంగా.. చాలామంది వాటిని తమ పిల్లల్లాగే పెంచుకుంటారు. తమ ఇంట్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, కుటుంబ సభ్యుల్లో ఒకరిగా వాటికి గౌరవం ఇస్తారు.
ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ అయితే.. ఓ అడుగు ముందుకేసి, ఒక కుక్కకు తన సంస్థలో ఉద్యోగిగా బంపరాఫర్ ఇచ్చాడు. ఆ కుక్కకు ‘బిజిలీ’ అనే పేరు పెట్టి.. దానికి కేటాయించిన ఐడీ కార్డ్‌ని ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశాడు. దానికి ‘440 వీ’ అనే ఎంప్లాయి ఐడీ కోడ్ కూడా కేటాయించడంతో పాటు.. ఆ ఐడీ కార్డ్‌పై బిజిలీ బ్లడ్ గ్రూప్ ‘paw+ve’ అని కూడా మెన్షన్ చేసి ఉంది. అంతేకాదండోయ్.. ఒకవేళ ఆఫీసులో ఉన్న ఉద్యోగులకు ఏమైనా అవసరమైతే, ‘స్లాక్’ అనే మెసేజ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా బిజిలీని సంప్రదించవచ్చు. బిజిలీ ఐడీ కార్డులో ఆఫీస్ అడ్రస్‌ని కూడా పొందుపరచడం జరిగింది. ట్విటర్ మాధ్యమంగా బిజిలీ ఐడీ కార్డ్‌ని షేర్ చేస్తూ.. ‘మా కొత్త ఆఫీస్ కొలీగ్’ అనే క్యాప్షన్ జోడించాడు.
ఈ ట్వీట్‌ని బట్టి.. కుక్కల పట్ల భవిష్‌కి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. అతను చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. కుక్కను ఎంప్లాయి హోదా ఇచ్చావంటే, నువ్వు నిజంగా గ్రేట్ బాస్ అంటూ అతడ్ని కొనియాడుతున్నారు. ‘‘ఇది బిజిలీ ప్రపంచం, మనం ఈ ప్రపంచంలో నివసిస్తున్నాం’’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా.. భవిష్ తన ఆఫీస్‌లో కుక్కల్ని చూపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తన ఆఫీస్‌లో సోఫాపై సేద తీరుతున్న మూడు కుక్కల ఫొటోను షేర్ చేస్తూ.. ‘మార్నింగ్స్ అట్ ద ఆఫీస్’ అనే క్యాప్షన్‌ని జత చేశాడు.
Updated Date - 2023-08-01T16:51:03+05:30 IST