Deep Fake: డీప్ ఫేక్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. అతి పెద్ద ముప్పుగా వ్యాఖ్య
ABN, First Publish Date - 2023-11-17T14:44:51+05:30
ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులలో డీప్‌ఫేక్(Deep Fake) ఒకటని, ఇవి సమాజంలో గందరగోళాన్ని గురి చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు.
ఢిల్లీ: ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులలో డీప్‌ఫేక్(Deep Fake) ఒకటని, ఇవి సమాజంలో గందరగోళాన్ని గురి చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. ఢిల్లీ(Delhi)లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ(BJP) దీపావళి మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ... కొత్త టెక్నాలజీలతో పెరుగుతున్న సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.
డీప్‌ఫేక్‌ల కోసం కృత్రిమ మేధస్సును(AI) దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో డీప్‌ఫేక్‌లు ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతకు సవాళ్లను విసురుతున్నాయని.. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, ఫొటోలు నకిలీవా, నిజమైనవా అని గుర్తించడం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని క్రియేట్ చేసిన చిత్రాలు, నకిలీ వీడియో క్లిప్‌లు, ఫేక్ వాయిస్‌ఓవర్‌ల వంటి డీప్‌ఫేక్‌ల బెదిరింపులను సమాజం రానున్న రోజుల్లో ఎదుర్కోనుందని చెప్పారు. ప్రధాని గర్బా నృత్యం చేస్తున్నట్లు ఓ ఫేక్ వీడియో వచ్చిందని.. తాను చిన్నప్పటి నుంచి గర్బా ఆడలేదని తెలిపారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయినప్పుడు వార్నింగ్ ఇవ్వాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్లు ప్రధాని తెలిపారు.
నటి రష్మికకు చెందిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటులు కాజోల్, కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై సోషల్ మీడియా సీఈవోలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. మార్ఫింగ్ ఫొటోలపై కంప్లెంట్ అందిన రోజున్నరలో వాటిని పూర్తిగా తొలగించాలని సోషల్ మీడియాను కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రధాని డీప్ ఫేక్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-17T14:44:53+05:30 IST