Supreme Court: మహిళలపై అనుచిత పదాలకు చెల్లు
ABN, First Publish Date - 2023-08-17T03:28:30+05:30
ఇక మీదట న్యాయ నిఘంటువులో ఈవ్ టీజింగ్, వేశ్య (ప్రాస్టిట్యూట్), గృహిణి (హౌస్ వైఫ్) వంటి పదాలు కనిపించవు. వాటి స్థానంలో వీధిలో లైంగిక వేధింపులు (స్ట్రీట్ సెక్స్‌వల్ హరా్‌సమెంట్), సెక్స్ వర్కర్, హోమ్ మేకర్ పదాలను వాడనున్నారు.
ప్రాస్టిట్యూట్, హౌస్ వైఫ్ వంటివి వాడొద్దు
సుప్రీం కోర్టు హ్యాండ్‌బుక్ విడుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఇక మీదట న్యాయ నిఘంటువులో ఈవ్ టీజింగ్, వేశ్య (ప్రాస్టిట్యూట్), గృహిణి (హౌస్ వైఫ్) వంటి పదాలు కనిపించవు. వాటి స్థానంలో వీధిలో లైంగిక వేధింపులు (స్ట్రీట్ సెక్స్‌వల్ హరా్‌సమెంట్), సెక్స్ వర్కర్, హోమ్ మేకర్ పదాలను వాడనున్నారు. కోర్టు తీర్పులు, విచారణ సందర్భంగా లింగ వివక్షకు తావు లేకుండా మహిళల ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి బుధవారం సుప్రీంకోర్టు ఓ హ్యాండ్ బుక్ విడుదల చేసింది. న్యాయస్థానాల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదాలకు ప్రత్యామ్నాయ పదాలను సూచించింది. ‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టిరియోటైప్స్’ పేరుతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పుల్లో మహిళలను ఉద్దేశించి వాడే అనుచిత పదాలు సరైనవి కావన్నారు. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థకు ఈ పుస్తకం సహాయపడుతుందన్నారు. లింగ వివక్ష లేకుండా కోర్టు తీర్పులు, ఆదేశాలు, డాక్యుమెంట్లు, అభ్యర్థనల్లో వాడాల్సిన ప్రత్యామ్నాయ పదాలు, వాక్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు.
కాగా, మహిళలు ధరించే దుస్తులు, ప్రవర్తన బట్టి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంటారని, అనుచిత పదాలు వాడుతుంటారని ఈ పుస్తకంలో ఆక్షేపించారు. అన్ని లింగాల వారికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని, మహిళలు పురుషులకు లొంగి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అత్తమామల బాగోగులను కోడలు చూసుకొనేలా సమాజం ఆమె పాత్రను చిత్రించిందని, పెద్దలను చూసుకోవాల్సిన బాధ్యత మహిళలకు మాత్రమే కాదని, ఇంట్లో అందరికీ ఉంటుందని స్పష్టం చేసింది. మహిళలకు పెద్దల బాగోగులతో పాటు పిల్లల సంరక్షణ, హోం వర్క్ చేయించడం, ఇంటి పనులు, ఇంకా ఇతర బాధ్యతలు ఉంటాయని పేర్కొంది. 30 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో అనుచిత పదాలు, వాటికి ప్రత్నామ్నాయ పదాల జాబితాను పొందుపరిచారు.
Updated Date - 2023-08-17T03:28:30+05:30 IST