ChatGPT : మోదీతో చాట్‌జీపీటీ సృష్టికర్త శాం ఆల్ట్‌మాన్ భేటీ
ABN, First Publish Date - 2023-06-09T11:44:04+05:30
ఓపెన్ఏఐ సీఈఓ శాం ఆల్ట్‌మాన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. మన దేశంలో కృత్రిమ మేధాశక్తి భవిష్యత్తు, దానివల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల గురించి చర్చించారు.
న్యూఢిల్లీ : ఓపెన్ఏఐ (OpenAI) సీఈఓ శాం ఆల్ట్‌మాన్ (Sam Altman) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narender Modi)తో సమావేశమయ్యారు. మన దేశంలో కృత్రిమ మేధాశక్తి (AI) భవిష్యత్తు, దానివల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల గురించి చర్చించారు. ఢిల్లీ ట్రిపుల్ ఐటీలో జరిగిన డిజిటల్ ఇండియా డయలాగ్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని శాం వెల్లడించారు. మోదీతో సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని చెప్పారు. కృత్రిమ మేధాశక్తి పట్ల మోదీ చాలా ఉత్సాహం ప్రదర్శించారని, ఆలోచనాత్మకంగా మాట్లాడారని తెలిపారు.
మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని శాం ఆల్ట్‌మాన్ చెప్పారు. కృత్రిమ మేధాశక్తి (Artificial Intellegence)పై మోదీ ఉత్సాహం ప్రదర్శించారని, దీనిపట్ల ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. దీనివల్ల లభించే ప్రయోజనాల గురించి మాట్లాడారని చెప్పారు. దేశం ముందు ఉన్న అవకాశాల గురించి, కృత్రిమ మేధాశక్తితో దేశం చేయగలిగిన అంశాల గురించి తాము చర్చించామని తెలిపారు. కొన్ని ఇబ్బందులను నిరోధించేందుకు అంతర్జాతీయంగా చట్టం అవసరమని తాము భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీ స్వీయ నియంత్రణను అమలు చేస్తోందన్నారు.
మోదీతో సమావేశమైనప్పటి ఫొటోను శాం ఆల్ట్‌మాన్ ట్వీట్ చేశారు. భారత దేశంలోని అద్భుతమైన టెక్నాలజీ వాతావరణం గురించి చక్కని చర్చ జరిగిందని చెప్పారు. కృత్రిమ మేధాశక్తి వల్ల భారత దేశం ఏ విధంగా లబ్ధి పొందగలదో చర్చించామన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులతో సమావేశాలన్నీ సంతృప్తికరంగా జరిగాయని తెలిపారు.
ఓపెన్ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ని సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిని భారత దేశం చాలా ఆత్రుతగా, త్వరగా ఎందుకు స్వీకరించిందని అడిగినపుడు మోదీ చాలా ఆలోచనాత్మకంగా, ఉత్సాహంగా మాట్లాడారని, అద్భుతమైన సమాధానాలు చెప్పారని, ఈ సమావేశం చాలా అద్భుతంగా జరిగిందని శాం చెప్పారు. వివిధ సేవలలో కృత్రిమ మేధాశక్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని శాం చెప్పారు. ప్రభుత్వ సేవలను విస్తరించేందుకు లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.
శాం ఆల్ట్‌మాన్ అభిప్రాయాలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, కృత్రిమ మేధాశక్తి వల్ల సమస్యలు తలెత్తకుండా నిరోధించేందుకు అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు, చట్టాలు ఉండాలని ఆల్ట్‌మాన్ చెప్తున్నారని, ఈ విషయంలో ఆయనకు తన సొంత ఆలోచనలు ఉన్నాయని, ఆయన ఈ విషయంలో మేధావి అని తెలిపారు. కృత్రిమ మేధాశక్తి కోసం రక్షణలు కల్పించేందుకు సొంత దృక్పథాలు గల మేధావులు మన దేశంలో కూడా ఉన్నారన్నారు. కృత్రిమ మేధాశక్తి యొక్క ఐక్యరాజ్య సమితికి శాం ఆల్ట్‌మాన్ మద్దతిస్తుండగా, ప్రజల అత్యుత్తమ ప్రయోజనాలకే మన దేశం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఇంటర్నెట్ సురక్షితంగా, నమ్మదగినదిగా ఉండేలా చేయడానికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి :
America : డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు ఆరోపణలతో కేసు నమోదు
Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కుమార్తె వివాహం అత్యంత నిరాడంబరంగా!
Updated Date - 2023-06-09T11:44:04+05:30 IST