Turkey Earthquake: బుద్ధిమార్చుకోని పాక్.. సహాయక సామగ్రితో తుర్కియే వెళ్తున్న భారత విమానానికి..
ABN, First Publish Date - 2023-02-07T16:20:22+05:30
వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే(Turkey)కు సహాయక
ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan) మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే(Turkey)కు సహాయక సామగ్రితో బయలుదేరిన భారత ఎన్‌డీఆర్ఎఫ్(NDRF) విమానానికి ఎయిర్‌స్పేస్ ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. సోమవారం సంభవించిన వరుస భూకంపాలకు తుర్కియే చిగురుటాకులా వణికింది. ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విలయంలో అసువులు బాసిన వారి సంఖ్య 4500 దాటేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రాత్రనక పగలనక శ్రమిస్తున్నాయి.
తుర్కియేలో జరిగిన విలయానికి ప్రపంచం మొత్తం కదిలిపోయింది. భారత్(India) సహా అనేక దేశాలు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ తుర్కియేకు సాయం అందిస్తామని ప్రకటించిన వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. భారత నుంచి తొలి విడత సహాయక సామగ్రితో ఎన్‌డీఆర్ఎఫ్ విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండోన్ ఎయిర్ బేస్(Hindon Air Base) నుంచి మంగళవారం ఉదయం తుర్కియేకు బయలుదేరింది. ఇందులో 100 మందితో కూడిన రెండు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలు, ఔషధాలు, ఇతర అత్యవసర పరికరాలు ఉన్నాయి.
అత్యవసరంగా బయలుదేరిన ఈ విమానానికి తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ నిరాకరించి తన అల్పబుద్ధిని బయటపెట్టుకుంది. విపత్కర సమయంలో మరింతగా స్పందించాల్సింది పోయి ఇలా సహాయక కార్యక్రమాలు ఆలస్యమయ్యే పరిస్థితిని తీసుకొచ్చి భారత్‌పై తనకున్న అక్కసును ఇలా బయటపెట్టుకుంది.
దీంతో భారత విమానం మరో మార్గం ద్వారా తుర్కియే చేరుకుని అదానా సకిర్పాసా విమానాశ్రయంలో ల్యాండైంది. భారత విమానానికి తమ ఎయిర్‌స్పేస్ నిరాకరించడం పాకిస్థాన్‌కు ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)కు భారత్ మానవతా సాయం కింద 50 వేల టన్నుల గోధుమలను పంపిస్తున్నప్పుడు కూడా పాకిస్థాన్ ఇలాగే తమ ఎయిర్‌స్పేస్ వాడుకునేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ తీరుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లోనూ నీచ రాజకీయాలు ఏంటంటూ దునుమాడుతున్నాయి.
Updated Date - 2023-02-07T16:24:21+05:30 IST