Pakistan - India: ఇండియా పేరు మీకొద్దా, అయితే మేము తీసుకుంటాం.. ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్?
ABN, First Publish Date - 2023-09-06T22:19:31+05:30
రాష్ట్రపతి భవనంలో నిర్వహించనున్న జీ20 విందు ఆహ్వానాలపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ ముద్రించడంతో.. దేశవ్యాప్తంగా దేశం పేరు మార్పుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దేశం పేరుని ‘భారత్’గా మారుస్తారా?...
రాష్ట్రపతి భవనంలో నిర్వహించనున్న జీ20 విందు ఆహ్వానాలపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ ముద్రించడంతో.. దేశవ్యాప్తంగా దేశం పేరు మార్పుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దేశం పేరుని ‘భారత్’గా మారుస్తారా? ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దేశం పేరుని భారత్‌గా మార్చాలంటూ కేంద్రప్రభుత్వం తీర్మానం చేస్తుందా? అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా దేశంలో పేరు మార్పుపై చర్చలు జరుగుతుంటే.. సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ భారతదేశం ఐక్యరాజ్య సమితి సమక్షంలో ఇండియా పేరుని అధికారికంగా వదులుకుంటే.. పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని చూస్తోందన్నదే ఆ వార్త సారాంశం.
సౌత్ ఆసియా ఇండెక్స్ అనే ట్విటర్ హ్యాండిల్ తన ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేసింది. ‘‘ఒకవేళ యునైటెడ్ నేషన్స్ సమక్షంలో భారతదేశం తన ‘ఇండియా’ పేరుని అధికారికంగా వదులుకుంటే, పాకిస్తాన్ ఆ పేరుని సొంతం చేసుకోవచ్చని స్థానిక మీడియా తెలిపింది. ఇండియా అనే పేరు సింధు ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి.. ఇండియా పేరుపై తమకు హక్కులు ఉన్నాయని పాకిస్తాన్‌లోని జాతీయవాదులు చాలాకాలం నుంచి వాదిస్తున్నారు’’ అంటూ ఆ ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఈ ట్వీట్ మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘ఇంకా గ్రామమే ఏర్పడలేదు, అప్పుడే..’’ (ఇంకా గ్రామం కూడా స్థిరపడలేదు, దొంగలు అప్పుడే చేరుకున్నారు అనే సామెత తరహాలో) అన్నట్టు ట్వీట్ చేశాడు.
అయితే.. దేశానికి ఇండియా నుంచి భారత్ పేరుని మారుస్తున్నట్టు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం జీ20 విందు ఆహ్వానాలపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని ముద్రించడం కారణంగా.. దేశం పేరు మార్పుపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ కేంద్రం దేశం పేరుని ‘భారత్’గా మారిస్తే.. దేశంలో గందరగోళ వాతావరణం నెలకొనడం ఖాయం. ఎందుకంటే.. గుర్తింపు కార్డుల దగ్గర నుంచి కరెన్సీ నోట్ల దాకా, ప్రతి దానిపై ‘ఇండియా’ అని ముద్రించబడి ఉంది. దేశం పేరు భారత్‌గా మారిస్తే.. అప్పుడు వాటిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. చూద్దాం.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?
Updated Date - 2023-09-06T22:19:31+05:30 IST