Parliament : వర్షాకాల సమావేశాల్లో రెండో రోజూ రసాభాస.. లోక్ సభ సోమవారానికి వాయిదా..
ABN, First Publish Date - 2023-07-21T13:13:48+05:30
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ, రాజ్యసభలలో శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదు : రాజ్‌నాథ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై చర్చ జరపడంపై ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదని ఆరోపించారు. ఈ సమస్యపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారన్నారు. అయినప్పటికీ, ప్రతిపక్షాలు చర్చకు సిద్ధపడటం లేదని, దీనినిబట్టి వారికి ఈ సమస్య పట్ల శ్రద్ధ లేదని స్పష్టమవుతోందని అన్నారు.
దోషులపై కఠిన చర్యలు : నిర్మల సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ గురువారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మాట్లాడారని, మణిపూర్ సంఘటన వల్ల యావత్తు దేశం సిగ్గుతో తలదించుకుంటోందని చెప్పారని అన్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో చాలా సున్నితమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దోషులను అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
బీజేపీ మొసలి కన్నీరు : సంజయ్ రౌత్
మణిపూర్ పరిస్థితిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఈ సమస్య గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోందన్నారు. కానీ మన పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదన్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతల గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ‘నిర్భయ’ కేసులో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అప్పటి ప్రభుత్వాన్ని వణికించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీ మొసలికన్నీరు కార్చుతోందన్నారు.
మెయిటీలు, కుకీల మధ్య మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడింది. దీనిపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. మే 18న పోలీసులకు ఫిర్యాదు అందిందని, దీనిపై జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు.
ఇవి కూడా చదవండి :
CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..
Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు
Updated Date - 2023-07-21T13:13:48+05:30 IST