Mann ki Baat : చంద్రయాన్-3లో మహిళల పాత్రపై మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావన
ABN, First Publish Date - 2023-08-27T12:38:59+05:30
చంద్రయాన్-3 కార్యక్రమం (Chandrayaan-3 mission) విజయవంతమవడం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి వేదికపైనా ఘనంగా చెప్తున్నారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు.
న్యూఢిల్లీ : చంద్రయాన్-3 కార్యక్రమం (Chandrayaan-3 mission) విజయవంతమవడం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతి వేదికపైనా ఘనంగా చెప్తున్నారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆయన నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో కూడా దీనిని ప్రస్తావించారు. ఈ విజయంలో మహిళా శాస్త్రవేత్తల పాత్రను కీర్తించారు.
ఈ నెల 23న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ‘శివశక్తి’ స్థానం వద్ద దిగింది. చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన మొదటి దేశంగా మన దేశం ఘనత సాధించింది. ఈ విజయానికి కారకులైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన ముగించుకుని, నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ, చంద్రయాన్-3 విజయవంతమవడం మహిళా శక్తికి సజీవ ఉదాహరణ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. భారతీయ మహిళలు నేడు అనంతమైన అంతరిక్ష విస్తృతిని కూడా సవాల్ చేస్తున్నారని ప్రశంసించారు. ఏ దేశంలోని మహిళలైనా అంతటి ఆకాంక్షలతో పని చేస్తూ ఉంటే, అభివృద్ధి చెందిన దేశంగా ఆ దేశం ఎదగకుండా ఎవరు ఆపగలరని ప్రశ్నించారు.
‘‘చంద్రయాన్-3 విజయం ఎంత గొప్పది అంటే, దాని గురించి ఎంత ఎక్కువగా చర్చించినా తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరూ కృషి చేసినపుడు, విజయం సాధించవచ్చు. ఇదే చంద్రయాన్-3 సాధించిన అతి గొప్ప విజయం’’ అన్నారు. నవ భారతం స్ఫూర్తికి చిహ్నంగా మిషన్ చంద్రయాన్ మారిందన్నారు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ గెలవాలని ఆకాంక్షించేది నవ భారతమని తెలిపారు. ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించడం ఎలాగో తెలిసినది నవ భారతమని చెప్పారు. నారీశక్తి సామర్థ్యం కూడా తోడైతే, అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుందన్నారు.
చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు సున్నితంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగింది. విక్రమ్ ల్యాండర్ సున్నితంగా దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. చంద్రయాన్-2 దిగిన ప్రదేశానికి తిరంగా అని నామకరణం చేశారు.
ఇవి కూడా చదవండి :
2024 Lok Sabha elections : మా ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ : అశోక్ గెహ్లాట్
Britain : భారత్ ఎదుగుదలపై బ్రిటన్ దౌత్యవేత్త వ్యాఖ్యలు
Updated Date - 2023-08-27T12:38:59+05:30 IST