G20 Meet : డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై మోదీ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-19T11:37:39+05:30
సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.
న్యూఢిల్లీ : సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో మెసేజ్ ద్వారా శనివారం ఆయన మాట్లాడారు.
ప్రపంచంలో చౌక ధరలకు లభించే డేటాను భారత దేశంలో 85 కోట్ల మంది ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. భారత దేశంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విస్తృతి, వేగం, పరిధులను ఆయన వివరించారు. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా పథకం వల్ల గత తొమ్మిదేళ్లలో భారత దేశంలో డిజిటల్ పరివర్తన జరిగిందని తెలిపారు. పరిపాలన తీరును మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్ (JAM trinity) వల్ల వ్యవస్థలో లోపాలను అరికట్టగలుగుతున్నామని చెప్పారు. లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదును అందజేయగలుగుతున్నట్లు తెలిపారు.
పన్నుల వ్యవస్థను పూర్తిగా డిజిటైజ్ చేయడం వల్ల పారదర్శకత వృద్ధి చెందుతోందని, ఈ-గవర్నెన్స్ జరుగుతోందని తెలిపారు. వర్కింగ్ గ్రూప్ రూపొందిస్తున్న జీ20 వర్చువల్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కామన్ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన పురోగతిలో ఉందని, ఇది అందరికీ న్యాయమైన, పారదర్శకత కలిగిన, జవాబుదారీతనంతో కూడిన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందని తెలిపారు.
జన్ ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటినట్లు, ఈ ఖాతాల్లో దాదాపు 67 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ఏరియాస్‌లో తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇది గొప్ప మైలురాయి అని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఖాతాల్లో సగం ఖాతాలు నారీ శక్తికి సంబంధించినవని, వీటిని మహిళలు తెరిచారని చెప్పారు. దేశంలోని అన్ని మూలలకు ఆర్థిక సమ్మిళితత్వం లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..
Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..
Updated Date - 2023-08-19T11:37:39+05:30 IST