Israel-Hamas War: పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. మానవతా సహాయం అందిస్తామంటూ భరోసా
ABN, First Publish Date - 2023-10-19T21:21:23+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై మోదీ తన సంతాపం...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై మోదీ తన సంతాపం తెలియజేశారు. తాము పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూనే ఉంటామని భరోసా కూడా కల్పించారు. ‘‘పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు హెచ్‌ఈ మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడటం జరిగింది. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పౌరుల ప్రాణాలు కోల్పోవడం పట్ల నా సంతాపాన్ని తెలియజేశాను. పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూనే ఉంటాం. తీవ్రవాదం, ఆ ప్రాంతంలో హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై మా ఆందోళనను ఆయనతో పంచుకున్నాం. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశపు దీర్ఘకాల సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించాను’’ అని మోదీ ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా తెలిపారు. పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇది రెండోసారి.
హమాస్ నియంత్రణలో ఉన్న గాజాలోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ అహ్లీ ఆసుపత్రిలో సంభవించిన పేలుడు కారణంగా 200 నుంచి 300 మంది మధ్య చనిపోయారని సమాచారం. అంతేకాదు.. ఈ దాడిలో మరెంతోమంతి తీవ్ర గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యమే ఈ దాడి చేసిందని హమాస్ ఆరోపణలు చేస్తుండగా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. ఏదేమైనా.. ఈ దాడి కారణంగా అమాయకపు ప్రజలు బలి అయ్యారు. దీంతో.. ఈ దాడిపై భారత్, అమెరికా సహా పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ ఘటన తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ మధ్య సామాన్య పౌరులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో మృతి చెందినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Updated Date - 2023-10-19T21:21:23+05:30 IST