Siddaramaiah vs DK Shivakumar: ఢిల్లీలో కీలక పరిణామం.. మల్లికార్జున్ ఖర్గేతో రాహుల్ గాంధీ...
ABN, First Publish Date - 2023-05-16T14:08:15+05:30
కర్ణాటక తదుపరి సీఎం పంచాయతీ కీలక దశకు చేరుకుంది. మంగళవారమే (ఈ రోజు) సీఎం ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును వేగవంతం చేసింది.
న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం పంచాయతీ (Karnataka CM tussle) కీలక దశకు చేరుకుంది. మంగళవారమే (ఈ రోజు) సీఎం ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ (Congress high Command) కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahun gandhi) కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీలో ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో (Mallikarjun kharge) ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తోపాటు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పలువురు ఉన్నారు. సీఎం ఎంపికకు సంబంధించిన కీలకాంశాలపై చర్చిస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తే బావుంటుంది?. ఎవరిని ఎంపిక చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి?. ఇద్దరినీ నొప్పించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే కీలకాంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీ కూడా ఢిల్లీ చేరుకున్నట్టు జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఏఐసీసీ హైకమాండ్ మీటింగ్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత ఆమె కూడా ఢిల్లీ వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ చేరుకున్న డీకే...
మరోవైపు సీనియర్ సిద్ధారామయ్య సీఎం అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. ఒంటరిగానే వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ రాహుల్ గాంధీతో డీకే భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డీకేతో ప్రత్యేకంగా మాట్లాడాలని రాహుల్ భావిస్తున్నారు. కాగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో విడివిడిగా భేటీ అయిన తర్వాత.. చివరిగా ఉమ్మడి భేటీ ఏర్పాటు చేయాలని మల్లికార్జున్ ఖర్గే భావిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. ఇక సిద్దరామయ్య రెండో రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. పలువురు సీనియర్లతో ఇప్పటికే ఆయన భేటీ అయ్యారు. అవసరమైతే సీఎం పదవిని డీకేతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సిద్ధూ ప్రతిపాదనలు చేశారు. మొదటి సంగం తానే ముఖ్యంగా ఉంటానని అధిష్ఠానం వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు ఈ రోజయిన తెరపడుతుందో లేదో వేచిచూడాలి.
Updated Date - 2023-05-16T14:33:53+05:30 IST