Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్?
ABN, First Publish Date - 2023-03-18T02:57:56+05:30
అదానీపై కాంగ్రెస్, విపక్షాలు.. యూకేలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ.. పార్లమెంటు కార్యకలాపాలను రోజూ స్తంభింపజేస్తున్నాయి. పార్లమెంటు రూల్స్ ఆధారంగా పరస్పరం దెబ్బతీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా రాహుల్‌ను బీజేపీ టార్గెట్ ..
లండన్‌లో వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు!..
లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ లేఖ
సభ నుంచి బహిష్కరించవచ్చేమో పరిశీలించాలని విజ్ఞప్తి
రాహుల్ క్షమాపణ చెప్పేదాకా సభలో మాట్లాడనివ్వబోమని స్పష్టీకరణ
అది జరిగేది కాదన్న ఖర్గే, థరూర్
న్యూఢిల్లీ, మార్చి 17: అదానీపై కాంగ్రెస్, విపక్షాలు.. యూకేలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ.. పార్లమెంటు కార్యకలాపాలను రోజూ స్తంభింపజేస్తున్నాయి. పార్లమెంటు రూల్స్ ఆధారంగా పరస్పరం దెబ్బతీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా రాహుల్‌ను బీజేపీ టార్గెట్ చేసుకుంది. భారత్‌లో ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడి జరుగుతోందని ఆయన కేంబ్రిడ్జి వర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారని.. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని.. అప్పటిదాకా ఆయన్ను సభలో మాట్లాడనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. రాహుల్ తప్పు చేయలేదని.. ఆయన క్షమాపణ చెప్పరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ కూడా తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని.. దాని నివేదిక ఆధారంగా ఆయన్ను సభ నుంచి బహిష్కరించవచ్చేమో పరిశీలించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పీకర్ ఓం బిర్లాకు తాజాగా లేఖ రాశారు. రాహుల్ పార్లమెంటుకు అతీతుడు కాదని.. క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, కిరెన్ రిజిజు, గోయల్ డిమాండ్ చేశారు. బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలకు తొలుత ఆయన పార్లమెంటు వెలుపల దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు. ఓ కుటంబ అహం దేశ అత్యున్నత సంస్థ పార్లమెంటును అధిగమించడం విషాదకరమన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభాహక్కుల తీర్మానం ప్రతిపాదించింది. గత నెలలో లోక్‌సభలో ప్రసంగిస్తూ నెహ్రూ కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పేర్కొన్నారు.
గతంలో స్వామిపై వేటు
పరాయిగడ్డపై పార్లమెంటు, ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 1976లో (అప్పట్లో దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది) నాటి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామిని సభ నుంచి బహిష్కరించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటన్, అమెరికా, కెనడాల్లోని రేడియోలు, టీవీలు, జర్నల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు.. ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తారేమోనని ప్రవాసంలో ఉన్న ఎంపీ అంటున్నారని ‘టొరంటో స్టార్’లో వచ్చిన వ్యాసాన్ని అప్పటి పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ ప్రస్తావించింది. ‘‘నాడు సుబ్రమణ్యంస్వామి చేసినట్లే ఇప్పుడు రాహుల్ కూడా చేశారు. పార్లమెంటుపై, ప్రధాని ప్రవర్తనపై సందేహాలు వ్యక్తంచేయడం ప్రజాస్వామ్యానికి హానికరం. లోక్‌సభలో రాహుల్ ప్రసంగాన్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. అయినప్పటికీ ఆయన ట్విటర్ హ్యాండిల్, యూట్యూబ్ చానళ్లలో అది అలాగే ఉంది. ఇది స్పీకర్ అధికారాన్నే సవాల్ చేయడం’’ అని నిశికాంత్ దూబే స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. యూపీఏ-1 సర్కారు హయాంలో 2008లో ఓటుకు నోట్ల స్కాం వెలుగులోకి వచ్చినప్పుడు విచారణకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దాని నివేదిక ఆధారంగా పది మంది లోక్‌సభ సభ్యులను, ఒక రాజ్యసభ సభ్యుడిని సభల నుంచి బహిష్కరించారని దూబే గుర్తుచేశారు. మరోవైపు.. రాహుల్‌పై దేశద్రోహ అభియోగం మోపాలన్న వాదన బీజేపీ నుంచి వస్తోంది.
లైవ్ ప్రొసీడింగులకు అంతరాయం
శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల పోటాపోటీ నినాదాలతో రెండు సభలు ఎలాంటి చర్చ లేకుండానే సోమవారానికి వాయిదాపడ్డాయి. సభ్యుల నినాదాలతో లోక్‌సభలో కొద్దిసేపు మైకులను ఆపు చేశారు. సంసద్ టీవీలో కూడా లోక్‌సభ ప్రొసీడింగుల ప్రత్యక్ష ప్రసారంలో ఆడియోను కొద్దిసేపు నిలిపివేశారు(మ్యూట్ చేశారు). దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, సాంకేతిక కారణంగానే ఇలా జరిగిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
యాంటీ ఇండియా టూల్‌కిట్‌లో
రాహుల్ శాశ్వత భాగస్వామి
భారతదేశంలో బలహీన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకునే ‘యాంటీ-ఇండియా టూల్‌కిట్’లో రాహుల్ శాశ్వత భాగస్వామి అయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దుయ్యబట్టారు. జార్జిసోరోస్ తరహాలో రాహుల్ గాంధీ కూడా భారత వ్యతిరేక భాష మాట్లాడుతున్నారని.. ‘‘దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యం కోరిన పాపానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని నడ్డా డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ ఏ నాయకుడూ విదేశీ గడ్డపై రాహుల్‌గాంధీ చేసిన పని చేయలేదని.. భారతదేశాన్ని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్న విదేశీ కుట్రదారులతో ఆయన చేతులు కలిపారని ధ్వజమెత్తారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ అమెరికా, యూరప్ దేశాల జోక్యం కోరడంకన్నా సిగ్గుచేటు పని ఇంకోటి లేదని మండిపడ్డారు. భారతదేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన బ్రిటన్ గడ్డపైన రాహుల్ మనదేశాన్ని అవమానించారని మండిపడ్డారు.
Updated Date - 2023-03-18T02:57:56+05:30 IST