Rajnath Singh : దేశ ప్రతిష్ఠను కాపాడటం కోసం దేనికైనా సిద్ధం : రాజ్‌నాథ్ సింగ్
ABN, First Publish Date - 2023-07-26T15:08:03+05:30
శ గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటడానికైనా వెనుకాడేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ప్రజలు సైనికులకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ : దేశ గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటడానికైనా వెనుకాడేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ప్రజలు సైనికులకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు ముందుకు వచ్చి, యుద్ధంలో పాలుపంచుకుంటున్నందువల్ల అది ఓ ఏడాదికిపైగా కొనసాగుతోందన్నారు. 24వ కార్గిల్ విజయోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో అమరులైన సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక కేంద్రంలో నివాళులర్పించారు. ఈ యుద్ధంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడారని, కర్తవ్య నిర్వహణలో అనేక మంది అమరులయ్యారని రాజ్‌నాథ్ ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. వారి త్యాగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.
ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక కేంద్రంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధాన్ని భారత దేశంపై రుద్దారని ఆరోపించారు. మన దేశాన్ని పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచిందన్నారు. మన సైనికులు పరాక్రమవంతులని, వారు దేశానికి పెద్ద పీట వేసి, తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారికి గౌరవ వందనం చేస్తున్నానని తెలిపారు.
‘‘యుద్ధం అంటే రెండు సైన్యాల మధ్య జరిగేది కాదు, అది రెండు దేశాల మధ్య జరిగేది. 1999 జూలై 26న యుద్ధంలో గెలిచినప్పటికీ, ఎల్ఓసీని దాటి మన సైన్యం వెళ్లలేదు, దీనికి ఏకైక కారణం మనం శాంతిని ప్రేమించేవారం కావడమే. మనం భారతీయ విలువలను విశ్వసిస్తాం. అంతర్జాతీయ చట్టాలకు మనం కట్టుబడి ఉంటాం. అప్పట్లో ఎల్ఓసీని మనం దాటలేదంటే, దాని భావం మనం ఎల్ఓసీని దాటలేమని కాదు. మనం ఎల్ఓసీని దాటగలిగేవారం, దాటగలం, భవిష్యత్తులో అవరమైతే దాటుతామని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ అన్నారు.
యుద్ధం వచ్చిన ప్రతిసారీ ప్రజలు ఎల్లప్పుడూ సైన్యానికి మద్దతుగా నిలిచారని, ఆ మద్దతు పరోక్షంగా ఉండేదని తెలిపారు. ఇప్పుడు అవసరమైతే యుద్ధ రంగంలో సైనికులకు ప్రత్యక్షంగా మద్దతివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. దేశ గౌరవ, మర్యాదలు, ప్రతిష్ఠను కాపాడటం కోసం ఎంత తీవ్రమైన చర్యలకైనా వెనుకాడేది లేదన్నారు. నియంత్రణ రేఖను దాటడానికైనా వెనుకాడబోమని చెప్పారు.
1999లో లడఖ్‌లో కీలక శిఖరాలను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ సైన్యంతో భారత సైనికులు వీరోచితంగా పోరాడి, వెనుకకు తరిమికొట్టారు. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయోత్సవాలను నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి :
Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం
Weather : ఉత్తరాంధ్ర, తెలంగాణ, అస్సాం, ఒడిశా, కొంకణ్, మలబార్ తీరాలకు భారీ వర్ష సూచన
Updated Date - 2023-07-26T15:37:50+05:30 IST