Rajnath Singh: మాల్దీవులకు భారత్ ఖరీదైన గిఫ్ట్‌లు
ABN, First Publish Date - 2023-04-30T17:17:53+05:30
భారత్ తమ భాగస్వామ్య, మిత్ర దేశాల సౌమర్థ్యాలను పెంచే క్రమంలో పొరుగు దేశమైన మాల్దీవులకు ఖరీదైన బహుమతులు..
న్యూఢిల్లీ: భారత్ తమ భాగస్వామ్య, మిత్ర దేశాల సౌమర్థ్యాలను పెంచే క్రమంలో పొరుగు దేశమైన మాల్దీవులకు (Maldives) ఖరీదైన బహుమతులు ఇవ్వనుంది. ఆ దేశానికి ఒక గస్తీ నౌక (Patrol Vessel Ship), ల్యాండింగ్ క్రాఫ్ట్ (Landing Craft)ను బహుకరించనుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మూడు రోజుల మాల్దీవుల పర్యటనలో మాల్దీవుల జాతీయ రక్షణ బలగాలకు ఈ గిఫ్ట్‌లు అందజేయనున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్ ఆహ్వానం మేరకు మే 1 నుంచి 3 వ తేదీ వరకూ ఆ దేశంలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది.
రాజ్‌నాథ్ సింగ్ తన పర్యటనలో భాగంగా మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్ షహీద్, రక్షణ శాఖ మంత్రి మారియా దీదీతో చర్చలు జరపనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్‌ను కలుసుకుంటారు. భారత్-మాల్దీవులు తీరప్రాంత భద్రత, ఉగ్రవాదం, రాడికలైజేషన్, ప్రైవేసీ, ట్రాఫికింగ్, ప్రకృతి వైపరీత్యాలు సహా పలు సవాళ్లను మంరిత సమష్టిగా ఎదుర్కొనేందుకు రాజ్‌నాథ్ పర్యటన ఉపకరించనుందని, ఇరుదేశాల మధ్య మైత్రీ సంబంధాల్లో ఈ పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందని రక్షణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. రాజ్‌నాథ్ తన పర్యటనలో భాగంగా ప్రవాసభారతీయులను కూడా కలుసుకుంటారు.
Updated Date - 2023-04-30T17:17:53+05:30 IST