TN Governer RN Ravi: తమిళనాడు పేరు మార్చాలని నేను అనలేదు.. గవర్నర్ యూ-టర్న్
ABN, First Publish Date - 2023-01-18T16:49:01+05:30
తమిళనాడు వర్సెస్ తమిళగం వివాదంపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. తమిళనాడు పేరు విషయంలో గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీలో రేగిన ..
చెన్నై: తమిళనాడు వర్సెస్ తమిళగం వివాదంపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) వెనక్కి తగ్గారు. తమిళనాడు పేరు విషయంలో గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీలో రేగిన దుమారం, క్విట్ తమిళనాడు, గెట్ ఔట్ రవి అంటూ నిరసనలు పెద్దఎత్తున వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన దీనిపై బుధవారంనాడు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను తమిళనాడుకు వ్యతిరేకిని కాదని, తమిళనాడు పేరు మార్చాలని తాను సూచించినట్టు వచ్చిన వార్తలు అవeస్తమని అన్నారు. కొందరు తన మాటలను వక్రీకరించారని తెలిపారు.
కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా బంధం ఉందని, దాని గురించి చెబుతూ తమిళగం అనే పదాన్ని వాడానని ఆయన చెప్పారు. చారిత్రక సాంస్కృతిక సందర్భంలో 'తమిళగం' అనే పదం సముచితమైనదిగా చెప్పేందుకు తాను ప్రయత్నించానని అన్నారు. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. తమిళనాడు అంటే తమిళుల దేశం అని, తమిళగం అంటే తమిళుల ఇల్లు అని అర్ధమని అన్నారు. దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, కాకపోతే అది అలవాటుగా మారిందని అన్నారు. చారిత్రక సాంస్కృతి సందర్భంలోనే తాను తమిళగం అనే పదం వాడానన్నారు. అంతమాత్రాన తాను తమిళనాడు పేరు మార్చమని సూచించినట్టు కాదని, కొందరు తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తన ప్రసంగంలోని మూల ఉద్దేశం పరిగణనలోకి తీసుకోకుండా తమిళనాడు అనే పదానికి వ్యతిరేకినంటూ ప్రచారం సాగిస్తున్నందున తాను ఈ వివాదానికి తెరదించుతూ వివరణ ఇస్తున్నట్టు చెప్పారు.
కాగా, దేశం మొత్తం ఒక విధానాన్ని అనుసరిస్తే...దాన్ని కాదని వ్యతిరేకించడం తమిళనాడుకు అలవాటయిందంటూ ఇటీవల గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రసంగ సమయంలోనూ తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అనే పేరును గవర్నర్ వాడటం, కొందరు తమిళనేతల పేర్లున్న పేరాలను విడిచిపెట్టడం తీవ్ర దుమారం రేపింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టడం, కొందరు ఎమ్మెల్యేలు క్విట్ తమిళనాడు అంటూ నినాదాలు చేయడం, ఆయన సభ నుంచి వాకౌట్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకేతో పాటు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే, ఇతర పార్టీలన్నీ గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తాజా వివరణ ద్వారా ఈ వివాదానికి తెరదింపే ప్రయత్నం చేశారు.
Updated Date - 2023-01-18T16:51:37+05:30 IST