ఒక్క బిస్కెట్‌కు రూ.లక్ష జరిమానా!
ABN, First Publish Date - 2023-09-07T01:17:02+05:30
ఒక్క బిస్కెట్...లక్ష రూపాయలు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది ధర కాదు...ప్యాకెట్‌లో ఒకే ఒక్క బిస్కెట్ తక్కువైన కారణంగా సదరు కంపెనీకి పడిన జరిమానా.
ప్యాకెట్‌లో తగ్గినందుకు పరిహారం చెల్లించాలి.. కంపెనీకి ఫోరం ఆదేశం
చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఒక్క బిస్కెట్...లక్ష రూపాయలు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది ధర కాదు...ప్యాకెట్‌లో ఒకే ఒక్క బిస్కెట్ తక్కువైన కారణంగా సదరు కంపెనీకి పడిన జరిమానా. చెన్నై ఎంఎండీఏ మాత్తూర్ ప్రాంతానికి చెందిన ఢిల్లీ బాబు 2021లో ఓ చిల్లర దుకాణంలో ఐటీసీ సంస్థ తయారుచేసే ‘సన్‌ఫీస్ట్ మారీ లైట్’ బిస్కెట్ ప్యాకెట్లు రెండు డజన్లు కొనుగోలు చేశారు. 16బిస్కెట్లు ఉండాల్సిన ప్యాకెట్‌లలో 15మాత్రమే ఉండడంతో దుకాణ యజమానిని ప్రశ్నించారు. ఐటీసీ సంస్థకూ ఫిర్యాదు చేశారు. అయినా సమాధానం రాకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఒక బిస్కెట్ విలువ 75 పైసలని, ప్రతిరోజూ 50 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు తయారుచేసే ఐటీసీ సంస్థ రూ.29 లక్షల మోసానికి పాల్పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఐటీసీ.. బిస్కెట్ ప్యాకెట్ బరువు చూసి మాత్రమే లెక్కిస్తామని, సంఖ్యను బట్టి కాదని బదులిచ్చింది. దీంతో ఫోరం బిస్కెట్ ప్యాకెట్ బరువును పరిశీలించగా 76 గ్రాములకు బదులుగా 74 గ్రాములున్నట్టు తేలింది. అయితే, నిబంధనల ప్రకారం ముందుగా ప్యాకేజీ చేసిన వాటిలో 4.5గ్రాముల వరకు తక్కువగా ఉన్నా పరవాలేదని ఐటీసీ సంస్థ సమర్ధించుకున్నా....ఇది కేవలం ప్రకృతి పరంగా ఆవిరి అయ్యే వాటికేనంటూ ఫోరం తోసిపుచ్చింది. పిటిషనర్‌కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Updated Date - 2023-09-07T01:17:24+05:30 IST