Samajwadi Party: రామ చరిత మానస్‌ను నిషేధించాలన్న సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత
ABN, First Publish Date - 2023-01-22T20:55:27+05:30
మహాకవి తులసీదాస్ రచించిన రామ చరిత్ మానస్ బ్యాన్ చేయాలని కూడా...
లక్నో: మధ్యప్రదేశ్ ఛత్తార్‌పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని జైలుకు పంపాలని సమాజ్ వాదీ పార్టీ నేత ప్రసాద్ మౌర్య డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. అంతేకాదు మహాకవి తులసీదాస్ రచించిన రామ చరిత్ మానస్ బ్యాన్ చేయాలని కూడా ఆయన కోరారు. ధర్మం పేరుతో అనాదిగా దళితులకు అన్యాయం జరిగిందని, దళితులకు న్యాయం చేయని ధర్మం నాశనమవ్వాలంటూ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రామ చరిత్ మానస్‌ను బ్యాన్ చేయాలన్న ప్రసాద్ మౌర్య డిమాండ్‌పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం, ఎగతాళి చేయడం ఫ్యాషన్ గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మత నాయకులను ఎవ్వరూ ఏమీ అనరని కూడా గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.
మహాకవి తులసీదాస్ రచించిన రామ చరిత మానసములోని రామాయణ పద్యాలను బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి భక్తులకు కథలుగా చెబుతుంటారు. అంతేకాదు హనుమాన్ చాలీసా పఠనం కూడా చేయిస్తుంటారు. రామ చరిత మానస్‌తో పాటు హనుమాన్ చాలీసా కూడా అవధీ భాషలో రాసినవే.
హనుమాన్ చాలీసా చదివితే బుద్ధి వికసిస్తుందని, యశస్సు, ధైర్యం పెరుగుతాయని, తులసీదాసు స్వయంగా వెల్లడించారు.
బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి కూడా భక్తులకు ఇవే విషయాలు చెబుతూ హనుమాన్ చాలీసా పఠనం చేయిస్తున్నారు. భూత, ప్రేతాలు తొలగిస్తామంటూ ధీరేంద్ర శాస్త్రి అంధ విశ్వాసాలు పెంచుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు బాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రిపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కూడా విమర్శలు చేశారు. మహిమలతో సమాజానికి మేలు జరగదని, మహిమలుంటే జోషి మఠ్‌ను కాపాడాలని సవాల్ విసిరారు. ధీరేంద్ర శాస్త్రిపై ముప్పేట విమర్శలు జరుగుతున్న సమయంలో ఆయనకు యోగా గురువు బాబా రాందేవ్ మద్దతుగా నిలుస్తున్నారు.
Updated Date - 2023-01-22T20:55:32+05:30 IST