Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ అయిన వేళ తెరపైకి కొత్త డిమాండ్.. ఎవరూ ఊహించని విధంగా..
ABN, First Publish Date - 2023-08-28T11:10:27+05:30
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఓ వింత, కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. చందమామను ‘హిందూ రాజ్యం’గా ప్రకటించాలని విపరీత వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ (Rover Pragyan) విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఓ వింత డిమాండ్ తెరపైకి వచ్చింది. చందమామను ‘హిందూ రాజ్యం’గా (Hindu Rastra) ప్రకటించాలని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన ప్రాంతాన్ని రాజధాని చేయాలని అన్నారు. ఇతర మతాలు ఈ డిమాండ్ చేయకముందే భారత ప్రభుత్వం చందమామపై తన యాజమాన్యాన్ని ప్రకటించాలన్నారు. అంతేకాదు ఈ మేరకు పార్లమెంట్‌లో తీర్మానాన్ని కూడా ఆమోదింపజేయాలని సూచన కూడా చేశారు.
ఇఈ మేరకు స్వామి చక్రపాణి మహారాజ్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. చంద్రుడిని హిందూ రాజ్యంగా ప్రకటించే విషయంలో భారత ప్రభుత్వం సత్వరమే స్పందించాలన్నారు. భారత్ ప్రభుత్వం త్వరగా ఈ మేరకు చర్యలు తీసుకుంటే అక్కడికి (చంద్రుడి) ఉగ్రవాదులు ఎవరూ చేరుకోలేరని అన్నారు. దిలావుండగా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి ‘శివ శక్తి పాయింట్’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామకరణం చేసిన విషయం తెలిసిందే.
ఇలాంటి వింత వ్యాఖ్యలు ఆయనకు కొత్త కాదు..
చక్రపాణి మహారాజ్ ఇలాంటి వింత వ్యాఖ్యలు చేయడం తొలిసారేమీ కాదు. 2020లో యావత్ దేశం కరోనాతో పోరాడుతున్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో గోమాత్రం పార్టీ నిర్వహించారు. రోగాల నుంచి రక్షణ కోసమంటూ ఆయనతోపాటు ఆల్ ఇండియా హిందూ మహాసభ సభ్యులు గోమూత్రాన్ని సేవించారు. ఇక జంతువులను చంపి తినడం వల్లే కరోనా వైరస్ వచ్చిందని చక్రపాణి మహారాజ్ అన్నారు. జంతువుని చంపితే ఒక శక్తి ఉద్భవిస్తుందని, ఆ ప్రాంతంలో ఆ శక్తి విధ్వంసానికి దారితీస్తుందన్నారు.
అంతేకాదు ప్రపంచ నేతలంతా భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఆవు మూత్రం తాగాలనడం అప్పట్లో చర్చనీయాంశమంది. ఇక 2018లో కేరళ వరదల సమయంలో స్పందిస్తూ.. బీఫ్ తినేవారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయవొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో స్వామి చక్రపాణి ఒక ‘ధర్మ సెన్సార్ బోర్డ్’ను ఏర్పాటు చేశారు. బాలీవుడ్, వెబ్‌సిరీస్‌లలో హిందూ మతాన్ని అవమానపరిచే కంటెంట్‌ని పర్యవేక్షించేందుకు దీనిని ఏర్పాటు చేశామని చెప్పిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-08-28T11:17:54+05:30 IST