సిద్దూ, డీకే.. సీఎం సీటు
ABN, First Publish Date - 2023-04-11T03:26:36+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యల మధ్య సీఎం పీఠంపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ గెలిచాక ఏఐసీసీ అధ్యక్షుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి అయితే..
ముఖ్యమంత్రి పీఠంపై ఇరువురు కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం
సీఎం రేసులో నేను కూడా: పరమేశ్వర
బెంగళూరు, ఏప్రిల్ 10: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యల మధ్య సీఎం పీఠంపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ గెలిచాక ఏఐసీసీ అధ్యక్షుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి అయితే.. తాను మద్దతిస్తానని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే, మరోదఫా ముఖ్యమంత్రి పీఠంపై సిద్దరామయ్య ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య రాజకీయ మంటలు రేగుతున్నాయి. ఇంకోవైపు డీకే వ్యాఖ్యలపై దళితుల ఓట్లపైనా చర్చ జరుగుతోంది. శివకుమార్ వ్యాఖ్యలతో ఖర్గేకు రావాల్సిన గుర్తింపు రాలేదన్న భావన వ్యక్తమవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే అంతిమమని డీకే చెబుతున్నారు. ‘‘ఖర్గే మా సీనియర్ నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. కానీ, పార్టీలో కొందరి అభిప్రాయం ప్రకారం ఆయనకు సరైన న్యాయం జరగలేదు. అందుకే ఆయన సీఎం అయితే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పాను’’ అని సోమవారం శృంగేరీలో మీడియాతో మాట్లాడుతూ డీకే వివరణ ఇచ్చారు. పార్టీకి ఖర్గే నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు. డీకే వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య ఆచితూచి స్పందించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి ఎంతటివారైనా కట్టుబడి ఉండాలన్నారు. ఇదిలావుంటే, ముఖ్యమంత్రి పీఠంపై సిద్దూతోపాటు డీకే కూడా ఆశలు పెంచుకున్నారని, అందుకే ఇరువురు నేతలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, పార్టీలో కొందరి అభిప్రాయం ప్రకారం.. ఖర్గే తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పాత్ర పరిమితంగానే ఉంటుందని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన అపరిమిత బాధ్యతలు మోస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేయడంతోపాటు పార్టీని అధికారంలోకితెచ్చే బాధ్యత కూడా ఆయన భుజాన వేసుకున్నారని అంటున్నారు.
‘దళిత సీఎం’ కోసం!
డీకే శివకుమార్ ఖర్గేకు మద్దతు తెలపడంతో దళిత ముఖ్యమంత్రి వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో ఇప్పటివరకు దళితులు ముఖ్యమంత్రి కాలేదు. ఈ నేపథ్యంలో.. ఈసారి కాంగ్రెస్ దళితులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, దళిత సామాజిక వర్గానికి సీఎంగా ప్రాధాన్యం ఇస్తే తాము కూడా పోటీలో ఉన్నట్టేనని ఎస్సీ నాయకుల్లో ముఖ్యులైన పరమేశ్వర, మునియప్ప ప్రకటించుకుంటున్నారు.
ఢిల్లీకి డీకే, సిద్దూ
సిద్దరామయ్య, డీకే శివకుమార్ హుటాహుటిన సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సిద్దూ బెంగళూరు నుంచి బయలుదేరగా దక్షిణ కన్నడ జిల్లా పర్యటనలో ఉన్న డీకే మంగళూరు నుంచి వెళ్లారు. టికెట్ల ఖరారు కంటే పలు కీలక అంశాలపై చర్చించేందుకే కాంగ్రెస్ అధిష్టానం వారిని ఢిల్లీ పిలిపించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేడి పెరిగినట్లుగానే కాబోయే సీఎం ఎవరనే అంశం కూడా తారస్థాయికి చేరుతోంది. ఖర్గే సీఎం అయితే తనకు అభ్యంతరం లేదని డీకే చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకున్నట్లు సాచారం. పదవిపై పట్టుదలకు పోతే పార్టీకి నష్టం తప్పదనే వీరిని పిలిచినట్లు సమాచారం.
Updated Date - 2023-04-11T03:26:36+05:30 IST