Sonia Gandhi: ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు.. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా మండిపాటు
ABN, Publish Date - Dec 20 , 2023 | 11:18 AM
పార్లమెంటు సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మండిపడ్డారు.
ఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మండిపడ్డారు. కాంగ్రెస్(Congress) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీజేపీ(BJP) ఆదేశాలతో ప్రజాస్వామ్యం గొంతునొక్కారని విమర్శించారు. సభలో ప్రతిపక్ష సభ్యుల న్యాయపర డిమాండ్ లకు సమాధానం చెప్పకుండా బహిష్కరించడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే అవుతుందని పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ.. "గతంలో ఎన్నడూ ఇంత మంది సభ్యులను సస్పెండ్ చేయలేదు. డిసెంబర్ 13న జరిగిన ఘటన క్షమించరానిది. ఒక సహేతుక, చట్టబద్ధమైన డిమాండ్ లేవనెత్తినందుకు ప్రభుత్వం సభ్యులకు ఈ శిక్ష విధించింది. ప్రధాని మోదీ ఈ ఘటనపై 4 రోజుల తరువాత సభలో కాకుండా పార్లమెంటు బయట స్పందించారు. జమ్ము-కాశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి దేశ భక్తుల పరువు తీసేందుకు చరిత్రను వక్రీకరించారు. ప్రధాని, హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ ప్రచారానికి నేతృత్వం వహించారు. అయినా మేం భయపడలేదు. నిజాలను ప్రజల ముందు ఉంచడానికి నిర్ణయించుకున్నాం. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా తక్షణం పునరుద్ధరించాలి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. లఢక్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి. వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని కనుక్కోవాలి. మహిళా రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాకు నిరాశ కలిగించాయి. ఓటమికిగల కారణాలను విశ్లేషించుకుంటున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ అనేక సవాళ్లు ఎదుర్కుంటోంది. అయినప్పటికీ మా ధైర్యం మమ్మల్ని నడిపిస్తుంది" అని అన్నారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Dec 20 , 2023 | 11:18 AM