Sorry.. India : సారీ.. ఇండియా!
ABN, First Publish Date - 2023-12-04T04:43:17+05:30
ఒకరిపై మరొకరి పోటీని నివారించి... ఒకే తాటిపై నిలిచి బీజేపీని అధికార పీఠం నుంచి దించాలన్న ‘ఇండియా’ కూటమి ఇక్కట్లలో పడింది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన అసెంబ్లీ
విపక్షాల ఐక్యతా యత్నాలకు పెద్దదెబ్బ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో లుకలుకలు
(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)
ఒకరిపై మరొకరి పోటీని నివారించి... ఒకే తాటిపై నిలిచి బీజేపీని అధికార పీఠం నుంచి దించాలన్న ‘ఇండియా’ కూటమి ఇక్కట్లలో పడింది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలు కావడమే దీనికి కారణం. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడటమే ఆలస్యం... కూటమిలో లుకలుకలు బయలుదేరాయి. బీజేపీని గట్టిగా ఎదుర్కోగల సత్తా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్‌లలోనే కాంగ్రెస్ ఇంత పేలవమైన ప్రదర్శన ఇస్తే... గుజరాత్, హరియాణా, అసోం తదితర రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఢీకొనడం అంత సులభం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హిమాచల్ మినహా మొత్తం ఉత్తరాదిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రె్‌సకు 51 సీట్లు ఉన్నాయి.
ఈ సంఖ్య వంద దాటితేగానీ ఆ పార్టీ అధ్యక్షతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు రావు. తాజా ఫలితాలతో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నమ్మకం తగ్గిపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘‘తెలంగాణతోపాటు కనీసం మరో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవాల్సింది. అప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం పట్ల విశ్వాసం ఏర్పడేది. ఇండియా కూటమిలో చేరేందుకు ధైర్యం వచ్చేది. ఇప్పుడు విపక్ష కూటమి దరిదాపుల్లోకి రావడానికి చాలా పార్టీలు సిద్ధం కాకపోవచ్చు’’ అని పరిశీలకులు చెబుతున్నారు. 6న ‘ఇండియా’ కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కానీ... ఆ భేటీకి ఎన్ని పార్టీలు వస్తాయో తెలియడంలేదు. ఇక... ఆయా పార్టీల నేతలు వచ్చినప్పటికీ కాంగ్రె స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలున్నాయి. ఖర్గే అధ్యక్షుడైనప్పటికీ ఆ పార్టీ వారసత్వ ప్రభావం నుంచి బయటపడకపోవడం, సోనియా, రాహుల్, ప్రియాంకల చుట్టే ప్రచారం తిరగడం ఆ పార్టీ బలహీనతగా మారిందని... ఇదే బీజేపీకి ఉపయోగపడుతోందని వివిధ రాజకీయ వర్గాలు అంటున్నారు.
పొత్తుల్లేక కత్తులు..
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించడం ఇండియా కూటమిలో లుకలుకలకు దారితీసింది. ‘అఖిలేశ్- విఖిలేశ్ వంటి వారికి సీట్లెందుకు?’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యానించడం తప్పుడు సంకేతాలు పంపింది. రాజస్థాన్‌లో హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీతో పొత్తుకు ‘నో’ అనడంతో జాట్‌ల ఓట్లు చీలిపోయాయి. లోక్‌సభ ఎన్నికల ముందే మిత్రపక్షాలకు మొండి చేయి చూపడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజా ఫలితాలతో ‘ఇండియా’లో విభేదాలు మరింత తీవ్రమై... ‘ఉమ్మడి’ లక్ష్యం నెరవేరకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
Updated Date - 2023-12-04T04:43:20+05:30 IST