Wrestlers : మరోసారి రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్రం.. ఈసారైనా..!
ABN, First Publish Date - 2023-06-07T09:16:44+05:30
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వీరు ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి, తమ ఉద్యోగ విధుల్లో చేరిన సంగతి తెలిసిందే.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చలు జరిపేందుకు వారిని తాను మరోసారి ఆహ్వానించానని చెప్పారు.
రెజ్లర్లు శనివారం రాత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఒలింపిక్ పతక విజేతలు బజ్రంగ్ పూనియా ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఈ సమావేశం గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని నిరసనకారులకు చెప్పారని తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని అమిత్ షా చెప్పారన్నారు. తమ నిరసన ముగిసిపోలేదని తెలిపారు. ప్రభుత్వ స్పందన తమకు సంతృప్తికరంగా లేదన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు.
అమిత్ షాను కలిసినవారిలో బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్ ఉన్నారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కొందరు డబ్ల్యూఎఫ్ఐ సిబ్బందిని కూడా పోలీసులు ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ ఢిల్లీ నివాసంలో పని చేస్తున్నవారిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మంగళవారం మాట్లాడుతూ, రెజ్లర్లు కోరిన మీదట జూన్ 9న వారికి మద్దతుగా తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే తాము వారికి మద్దతును ఉపసంహరించలేదన్నారు. అమిత్ షాతో రెజ్లర్లు సమావేశమైన విషయం తనకు తెలుసునని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంపై సానుకూల నిర్ణయం
State Govt: వారి వేతనం పెంచే అవకాశమే లేదు..
Updated Date - 2023-06-07T10:09:26+05:30 IST