Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?
ABN, First Publish Date - 2023-08-14T17:32:19+05:30
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది..
ఢిల్లీ : ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఎంపీ ఇంటి కిటికీ అద్దాలను దుండగులు పగులగొట్టారు. ఘటనపై ఎంపీ పీఏ.. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఎంపీ ఇంటికెళ్లిన పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కిటికీ అద్దాలు ఎలా పగిలాయి..? ఈ ఘటనకు కారకులెవరు..? ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు..? అనేదానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. అసద్ ఇంటితోపాటు.. చుట్టుపక్కలున్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సామాన్యుడి పరిస్థితేంటి..?
కాగా.. ఈ ఘటనపై ఎంపీ స్పందించారు. ఓవైపు ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్లు నడుపుతూ.. మరోవైపు ఎంపీల ఇంటిపైకి రాళ్లు రువ్వడం ఏ మాత్రం సమంజసం అని ప్రశ్నించారు. కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. ఇవాళ జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. రాళ్ల దాడి గురించి తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే ఇక సామాన్యుడి సంగతేంటి? అని ఒకింత ఆవేదనకు లోనయ్యారు. తన ఇంటిపై జరిగిన రాళ్ల దాడే.. బీజేపీ నేత ఇంట్లో జరిగివుంటే పెద్ద గొడవే జరిగేదని.. ఇలాంటి ఘటనలు దేశానికి ఏ మాత్రం మంచిదికాదని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.
అసదుద్దీన్ ఇంటిపై ఇలా దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో కూడా గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారు. అంతకుముందు 2014 లో కూడా జరిగింది. ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఎంపీ ఇంటిపై ఇలా దాడి జరగడం గమనార్హం. దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని అసద్ అభిమానులు, ఎంఐఎం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-08-14T17:38:10+05:30 IST