Demonetisation: పెద్దనోట్ల రద్దు వ్యతిరేక పిటిషన్లపై 2న సుప్రీం తీర్పు
ABN, First Publish Date - 2023-01-01T19:48:26+05:30
పెద్ద నోట్లను రద్దుపై 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు...
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు (Demonetisation)పై 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme court) ఈనెల 2వ తేదీ సోమవారం నాడు తీర్పు (Verdict) వెలువరించనుంది. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. జస్టిస్ ఎస్ఏ నజీర్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. న్యాయమూర్తులు గవాయ్, నాగరత్న, ఏఎస్ బొమ్మై, వి.రామసుబ్రమణియన్‌లు ఈ ధర్మాసనంలో ఉన్నారు. 2016లో కేంద్ర పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, జస్టిస్ నజీర్ ఈనెల 4వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. శీతాకాల సెలవులు అనంతరం సుప్రీంకోర్టు సోమవారం తిరిగి ప్రారంభం కానుంది.
Updated Date - 2023-01-01T19:58:28+05:30 IST