ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: చర్చకు సిద్ధం

ABN, First Publish Date - 2023-07-25T03:00:01+05:30

మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ ఘటనపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సోమవారం కూడా దద్దరిల్లింది.

మణిపూర్‌లో ఏం జరుగుతోందో దేశానికి తెలియాలి

లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

ప్రధానే ప్రకటన చేయాలని ప్రతిపక్షాల పట్టు

రూల్‌ 267 కింద చర్చకు 27 మంది నోటీసులు

మూడో రోజు కూడా స్తంభించిన పార్లమెంటు

టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌పై ధన్‌ఖడ్‌ ఆగ్రహం

ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌( Manipur)లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ ఘటనపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు(Parliament) సోమవారం కూడా దద్దరిల్లింది. ప్రధాని మోదీ(Prime Minister Modi) స్వయంగా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిపక్షాలు(Opposition parties) అడ్డుకోవడంతో లోక్‌సభ 25 నిమిషాల పాటు మాత్రమే సాగింది. జీరో అవర్‌ కూడా కేవలం 9 నిమిషాలు సాగిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నిరసన ధ్వనుల మధ్యే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) లేచి మణిపూర్‌పై ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇంత ముఖ్యమైన, సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు ఎందుకు చర్చకు ఒప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మణిపూర్‌లో ఏమి జరుగుతోందో దేశానికి తెలియడం ముఖ్యమన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రధాని సభకు రావాలని పట్టుబట్టడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా(Speaker Om Birla) లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ మణిపూర్‌ అంశంపై ఒకసారి వాయిదా పడగా, ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌(Sanjay Singh) సస్పెన్షన్‌పై మూడుసార్లు వాయిదా పడింది. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhad) ప్రకటించారు. గందరగోళం మధ్యే లోక్‌సభ(Lok Sabha)లో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు.

27 మంది ఎంపీల నోటీసులు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌ ఘటన కుదిపేస్తోంది. ఈ అంశంపై 267 నిబంధన కింద చర్చ చేపట్టాలని రాజ్యసభలో 27 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఈ నిబంధన కింద మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి నిర్దిష్ట అంశంపై విస్తృత చర్చ చేపట్టాల్సి ఉంటుంది. కేంద్రం మాత్రం 176 నిబంధన కింద స్వల్పికాలిక చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతుండడంతో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. కేంద్రం దీన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ సహా అన్ని రాష్ట్రాల్లో మహిళలపై దాడులపై చర్చించాల్సిన అవసరం ఉందని అంటోంది. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాల సభ్యులు నిరసన కొనసాగించారు. ‘మణిపూర్‌పై చర్చ జరగాలని ఇండియా కోరుతోంద’ని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

చైర్మన్‌ను సవాల్‌ చేస్తున్నారా?

రాజ్యసభలో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 167 నిబంధన కింద నోటీసులు ఇచ్చిన ఎంపీల పేర్లను, వారి పార్టీల పేర్లను ధన్‌ఖడ్‌ చదివి వినిపించారు. వీరంతా ఎన్డీఏ కూటమిలోని పార్టీల సభ్యులే. ఇక 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చిన ప్రతిపక్ష ఎంపీల పేర్లు చదివిన ధన్‌ఖడ్‌ వారి పార్టీలను విస్మరించారు. దీనిపై ఒబ్రెయిన్‌ నిరసన తెలిపారు. ప్రతిపక్ష ఎంపీల పార్టీల పేర్లను కూడా చదవాలని పట్టుబట్టారు. దాంతో ఆయనను సీట్లో కూర్చోవాలని ధన్‌ఖడ్‌ పలుమార్లు కోరారు. అయినప్పటికీ ఒబ్రెయిన్‌ పట్టించుకోకపోవడంతో ‘మీరు అధ్యక్ష స్థానాన్ని సవాల్‌ చేస్తున్నార’ని ఆగ్రహించారు.

ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సస్పెన్షన్‌

ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్‌ కొనసాగనుంది. మణిపూర్‌ అంశంపై చర్చ చేపట్టాలంటూ నిరసనకు దిగిన సంజయ్‌ సింగ్‌ సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆయనను వెనక్కి వెళ్లి సీట్లో కూర్చోవాలని ధన్‌ఖడ్‌ హెచ్చరించినా సంజయ్‌సింగ్‌ పట్టించుకోలేదు. అనంతరం సంజయ్‌ సింగ్‌ సస్పెన్షన్‌కు కేంద్ర మంత్రి గోయల్‌ తీర్మానం ప్రవేశపెట్టగా... సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. తన ఆదేశాల్ని పదే పదే ధిక్కరిస్తూ వెల్‌లోకి దూసుకువస్తున్నందు వల్ల సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ధన్‌ఖడ్‌ ప్రకటించారు. సస్పెన్షన్‌ తర్వాత కూడా సభ నుంచి వెళ్లిపోయేందుకు సంజయ్‌ సింగ్‌ అంగీకరించకపోవడంతో సభాపతి సభను వాయిదా వేయవలసి వచ్చింది.

ఇప్పటివరకు ఏడుగురు కుకీ మహిళలపై అత్యాచారం!

మణిపూర్‌లో ఘర్షణలు తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకు పలు ఘటనల్లో మొత్తం ఏడుగురు కుకీ-జోమీ తెగకు చెందిన మహిళలపై అత్యాచారం జరిగిందని పలు గిరిజన సంఘాలు ఆరోపించాయి. మణిపూర్‌లో ఇప్పటివరకు 27 మంది కుకీ మహిళలను చంపేశారని ది వైపేయి పీపుల్స్‌ కౌన్సిల్‌, యంగ్‌ వైపేయి అసోసియేషన్‌, జోమీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, కుకీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సంస్థలు వెల్లడించాయి. వారిలో ఏడుగురు అత్యాచారానికి గురయ్యారని, ఎనిమిది మందిని కొట్టి చంపారని, ఇద్దరిని దహనం చేశారని, ఐదుగురిని తుపాకీతో కాల్చి చంపారని, ముగ్గురిని ఉరి వేసి చంపారని ఆరోపించాయి. మిగిలిన వారి మృతికి గల కారణాలు తెలియరాలేదని వెల్లడించాయి. అయితే ఆ ఆరోపణలను సీఎం బీరేన్‌సింగ్‌ సోమవారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన నాటి నుంచి 6,068 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా ఒకే ఒక అత్యాచార ఘటన నమోదైందని తెలిపారు. కార్‌ వాష్‌ సెంటర్‌ ఘటనలోనూ బాధితులపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టంలో తేలిందని సీఎం వెల్లడించారు.

Updated Date - 2023-07-25T03:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising