భారత్ వస్తున్న నౌకపై.. ఇరాన్ నుంచే దాడి
ABN, Publish Date - Dec 25 , 2023 | 01:47 AM
సౌదీ అరేబియా నుంచి మంగళూరు పోర్టుకు వస్తున్న నౌక(ఎంవీ షెమ్ ప్లూటో)పై డ్రోన్ దాడి ఇరాన్ భూభాగం నుంచే జరిగిందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. శనివారం గుజరాత్‌లోని పోరుబందర్ పోర్టుకు 120 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన
వెల్లడించిన అమెరికా రక్షణ శాఖ.. ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి
ఎర్ర సముద్రంలో మరో రెండు నౌకలపై దాడి
న్యూఢిల్లీ, డిసెంబరు 24: సౌదీ అరేబియా నుంచి మంగళూరు పోర్టుకు వస్తున్న నౌక(ఎంవీ షెమ్ ప్లూటో)పై డ్రోన్ దాడి ఇరాన్ భూభాగం నుంచే జరిగిందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. శనివారం గుజరాత్‌లోని పోరుబందర్ పోర్టుకు 120 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన దాడితో.. హౌతీల దుశ్చర్యలు ఎర్ర సముద్రాన్ని దాటాయని పరోక్షంగా ప్రస్తావించింది. అమెరికా రక్షణ శాఖ నివేదికను ఇరాన్ ఖండించింది. హౌతీల దాడుల వెనక టెహ్రాన్ ప్రమేయం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అలీ బఘేరీ వ్యాఖ్యానించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ కూడా టెహ్రాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికా వ్యాఖ్యలను ఖండించారు. ఎర్ర సముద్రంలో శనివారం మరోమారు అలజడి నెలకొంది. హౌతీలు రెండు నౌకలపై డ్రోన్ దాడులు చేశారు. గాబన్ పతాకంతో వెళ్తోన్న ఓ నౌకపై దాడి జరగ్గా.. అమెరికా యుద్ధ విమానం అందులోని సిబ్బందిని కాపాడింది. వారిలో 25 మంది భారతీయులున్నారు. దీనిపై అమెరికా నావికాదళం సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెడుతూ.. ‘‘భారత్‌కు చెందిన నౌకపై యెమెన్ భూభాగం నుంచి హౌతీలు దాడి చేశారు’’ అని పేర్కొంది. దీనిపై భారత నౌకాదళం వివరణ ఇచ్చింది. అది తమ మధ్య ఆఫ్రికాలోని గాబన్ దేశానికి చెందిన నౌక అని, అయితే.. భారత్‌లో కూడా ‘ఎంవీ సాయిబాబా’ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని పేర్కొంది. మరోవైపు సలీఫ్ తీరానికి 45 నాటికల్ మైళ్ల దూరంలో నార్వే జెండాతో వెళ్తున్న ‘ఎంవీ బ్లామనెన్’ అనే నౌకపైనా హౌతీలు దాడి చేశారని అమెరికా తెలిపింది. ఎర్ర సముద్రంలో పహారా కాస్తున్న తమ యుద్ధ నౌక ‘యూఎ్‌సఎస్ లబూన్’పైనా క్షిపణి దాడి జరగ్గా.. తమ యాంటీ-మిసైల్ వ్యవస్థలు దీటుగా ఎదుర్కొన్నట్లు వివరించింది. హౌతీలు ఇప్పటివరకు 15 నౌకలపై దాడులు చేశారు.
ఇరాక్ యుద్ధ నిపుణులు ఏమంటున్నారంటే?
హౌతీలు ఇరాన్ భూభాగం మీద నుంచే భారత తీరంలోని నౌకపై చేసిన దాడి చేశారంటూ ఇరాక్ యుద్ధ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ‘‘ఇప్పటి వరకు ఈ ఘటనపై ఏ సంస్థ కూడా ప్రకటన చేయలేదు. అయితే. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల మాదిరిగానే డ్రోన్ దాడి జరిగింది. హౌతీల వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణి సమద్-3కి 1,500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యముంది’’ అని బగ్దాద్‌లోని విశ్రాంత మేజర్ జనరల్ మాజిద్ అల్-ఖైసీ చెప్పారు. హౌతీలు ‘సింగిల్ స్టేజ్’ డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. సింగిల్ స్టేజ్ డ్రోన్లను ఆత్మాహుతి ఆయుధాలు అని చెబుతారని, వాటిని రిమోట్ ద్వారా లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే.. హౌతీలకు 1,000 నుంచి 1,200 కిలోమీటర్ల దూరంలో ఉండే తమ లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సాంకేతికత, ట్రాకింగ్ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి.. హౌతీలకు ఇరాన్ ఇంటెలిజెన్స్ సాయంపై అమెరికా ఇచ్చిన నివేదికను పరోక్షంగా బలపరిచారు.
Updated Date - Dec 25 , 2023 | 07:04 AM