Criminal Code Bills: ఆ మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోదం.. బ్రిటిష్ కాలం నాటి యాక్ట్‌ల స్థానంలో కొత్త చట్టాలు
ABN, Publish Date - Dec 20 , 2023 | 05:55 PM
బుధవారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఐసీపీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో...
Criminal Code Bills: బుధవారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఐసీపీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ఈ కొత్త చట్టాలు అందుబాటులోకి రానున్నాయి. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై నిరసనల నేపథ్యంలో 143 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ మధ్య ఈ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. వందేళ్ల వరకు ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయని అన్నారు.
భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సుకు ఈ మూడు కొత్త చట్టాలు ప్రాధాన్యతని ఇస్తాయని అమిత్ షా నొక్కి చెప్పారు. రేపు (గురువారం) రాజ్యసభలోనూ ఈ మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. గత చట్టాలు 150 ఏళ్ళ క్రితం నాటివి అని.. ఈ కొత్త బిల్లులు న్యాయం చేయడానికి అని, శిక్షించడానికి కాదని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత కల్పించేలా ఈ చట్టాల్లో మార్పులు చేశామని అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రతి కామాను తాను దాటానని, ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయని తెలిపారు.
కొత్త చట్టాల ప్రకారం.. నేర దర్యాప్తుకు కాలపరిమితి కేటాయించడం జరుగుతుంది. ఎవిడెన్స్ యాక్ట్ నుంచి 5 సెక్షన్లను, ముఖ్యంగా దేశద్రోహ సెక్షన్‌ను తొలగించారు. దేశానికి వ్యతిరేకంగా చేసే చర్యలకు శిక్షను కొనసాగింపు ఉంటుంది. మూక దాడికి ఏడేళ్ళ జైలు శిక్ష లేదా ఉరిశిక్ష విధిస్తారు. సాముహిక అత్యాచారినికి 20 ఏళ్ళ జైలు శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష. డిజిటల్ ఎవిడెన్స్‌ను పరిగణలోకి తీసుకునేలా కొత్త చట్టాల్లో మార్పులు చేశారు. దేశద్రోహ కేసుకు జీవిత ఖైదు నుంచి ఏడేళ్ల జైలు శిక్షకు మార్చారు. నేరం చేసి పారిపోయిన వారు 90 రోజుల్లో లొంగిపోవాలి, లేకపోతే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి, తీర్పుని వెలువరిస్తారు. దోషులను విదేశాల నుంచి తీసుకొచ్చి ఉరిశిక్ష వేస్తామని అమిత్ షా అన్నారు.
మైనర్ బాలికపై అత్యాచారానికి జీవిత ఖైదు, ఒకవేళ బాలిక చనిపోతే ఉరిశిక్ష విధిస్తారు. మహిళలకు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దర్యాప్తు, సోదాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి చేశారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు, 24 గంటల్లో దానిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు మార్చుకోవచ్చు. నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌లో పెట్టుకోవడానికి వీలు లేదు. అరెస్ట్ అయిన వారి కేసు వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ప్రతి పోలీస్టేషన్‌లో ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఆర్ధిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మళ్లిస్తారు. నేరం సందర్భంగా పట్టుకున్న వాహనాలను కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలని నిర్ణయించారు. పోలీస్టేషన్స్ ఆధునీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల జైలుశిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ టీమ్స్ దర్యాప్తు తప్పనిసరి చేయడం జరిగింది.
Updated Date - Dec 20 , 2023 | 05:57 PM