Uday Kotak: ఎండీ, సీఈఓ పదవి నుంచి తప్పుకున్న ఉదయ్ కోటక్
ABN, First Publish Date - 2023-09-02T18:11:20+05:30
భారత దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవులకు ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ప్రస్తుతం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకూ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: భారత దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవులకు ఉదయ్ కోటక్ (Uday Kotak) రాజీనామా చేశారు. ప్రస్తుతం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకూ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వహించనున్నారు. కోటక్ మహీంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు కూడా అయిన ఉదయ్ కోటక్ పదవీ కాలం నిజానికి డిసెంబర్ 31తో ముగియాల్సి ఉండగా, నాలుగు నెలలకు ముందే ఆయన తమ పదవి నుంచి తప్పుకున్నారు.
కాగా, తన వారసుని ఎంపిక అవసరమైన చర్యలను బ్యాంకు తీసుకుంటుందని, ఆర్బీఐ ఆమోదం కోసం ప్రస్తుతం ఎదురుచూస్తోందని కోటక్ తెలిపారు. ప్రస్తుతం తాను బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నట్టు చెప్పారు. తాను పదవి నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు లేఖ రాస్తూ, త్వరలో జరుగనున్న తన కుమారుడి వివాహం, ఇతర కుటుంబ బాధ్యతలను పరిగణలోకి తీసుకుని ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగి వేరొకరికి పగ్గాలు అప్పగించేందుకు ఇదే తగిన సమయంగా భావించినట్టు చెప్పారు. స్వచ్ఛందంగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తవారికి బాధ్యతలు సాఫీగా అప్పగించాలని అనుకున్నట్టు తెలిపారు. 38 ఏళ్ల క్రితం కోటక్ మహేంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడిగా తన ప్రయాణాన్ని వివరిస్తూ, బ్యాంకు వ్యవస్థాపకుడిగా, ప్రమోటర్, షేర్ హోల్డర్‌గా సేవలందించానని అన్నారు. తమ కుటుంబం పేరు ఒక బ్రాండ్‌గా మారడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విశ్వసనీయతకు మారుపేరుగా సంస్థ నిలిచిందని, సంస్థ మరింత అభివృద్ధి, పురోగమనం సాధించేందుకు స్టేక్‌హోల్టర్‌గా కట్టుబడి ఉంటానని చెప్పారు.
Updated Date - 2023-09-02T18:11:20+05:30 IST