Israel-Palestine: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ మండిపాటు.. అసలేమైంది?
ABN, First Publish Date - 2023-10-19T17:46:11+05:30
అక్కడ హమాజ్ (పాలస్తీనా మిలిటెంట గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంటే.. ఇక్కడ ఆ యుద్ధం విషయమై రాజకీయ పార్టీలు కుమ్ములాటలు చేసుకుంటున్నాయి. పరస్పర అభిప్రాయాలు తీవ్రస్థాయిలో విమర్శలు...
అక్కడ హమాజ్ (పాలస్తీనా మిలిటెంట గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంటే.. ఇక్కడ ఆ యుద్ధం విషయమై రాజకీయ పార్టీలు కుమ్ములాటలు చేసుకుంటున్నాయి. పరస్పర అభిప్రాయాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సంక్షోభంపై భారత ప్రభుత్వ వైఖరి విషయంలో కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఇజ్రాయెల్ పరిస్థితులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ యుద్ధం వ్యవహారంలో కేంద్రం తీరు మొదటి నుంచే భిన్నంగా ఉందంటూ కాంగ్రెస్ తప్పుపట్టింది.
ఇటీవల గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 500 మంది మృతిచెందగా, మరెందరో తీవ్రంగా గాయపడ్డారని వార్తలొచ్చాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమన్న మోదీ.. ఆసుపత్రిపై దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని ట్విటర్ మాధ్యమంగా డిమాండ్ చేశారు.
ఇలా గాజా ఆసుపత్రి ఘటనపై ప్రధాని మోదీ స్పందించిన తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పాలస్తీనా వాదాన్ని బలపరచడంతోపాటు, హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతుగా నిలిచేది. అదే సమయంలో ఏదైనా దాడులు, ప్రతిదాడుల జరిగితే.. వాటిని అప్పటికప్పుడే తీవ్రంగా ఖండించేది. కానీ.. దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారత్ వైఖరి యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. గతంలో మాదిరిగానే ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై భారత్ తన వైఖరిని హుందాగా, గౌరవప్రదమైన రీతిలో తెలియజేయాలి’’ అని తన ఫేస్‌బుక్ పోస్టులో వేణుగోపాల్ పేర్కొన్నారు.
అమాయకులు, మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు.. దాన్ని వ్యతిరేకించకుండా భారత్ ఎలా ఈ అంశంపై తన బలమైన వైఖరిని చూపుతుందని వేణుగోపాల్ ప్రశ్నించారు. ప్రస్తుత సమస్యపై భారత్ వైఖరి తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. ఈ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం, గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో వందల్లో పాలస్తీనియన్లు మరణించడం వంటి సంఘటనల్ని ఖండించాల్సిందేనని చెప్పారు. అటు, హమాస్ అకృత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమన్న ఆయన.. అలాంటి పరిస్థితులకి దారితీసిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
గాజాను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ క్రూరమైన దాడి చేస్తోందని, దీనికి కొన్ని దేశాలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని వేణుగోపాల్ పేర్కొన్నారు. భారత్ మాత్రం ఇందుకు మద్దతు తెలపొద్దని ఆయన సూచించారు. శాంతిని నెలకొల్పడానికి, బాధితులకు ఉపశమనం కలిగించే ప్రయత్నాలకు భారతదేశం నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఇది భారతదేశం నుండి ప్రపంచం ఆశించే గౌరవప్రదమైన వైఖరి అని చెప్పారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌తో కలిసి అసలు సమస్యని విస్మరించారని అన్నారు. ఆ భూమి (పాలస్తీనా) ఎవరికి చెందిందో, వారికే తాము మద్దతు ఇస్తామని వేణుగోపాల్ తేల్చి చెప్పారు.
Updated Date - 2023-10-19T17:46:11+05:30 IST