India-Canada dispute : వీసాలు బంద్
ABN, First Publish Date - 2023-09-22T03:00:32+05:30
భారత్-కెనడా వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అటు కెనడా, ఇటు భారత్ ఆయా దేశాలకు
కెనడా దేశస్థులకు భారత వీసాల నిలిపివేత.. కేంద్రం నిర్ణయం
దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని ఆ దేశ ఎంబసీకి ఆదేశం
నిజ్జర్ హత్యపై సాక్ష్యాధారాలు ఇస్తే సహకరిస్తామని వెల్లడి
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వైఖరిని మార్చుకోవాలని హితవు
కెనడా దర్యాప్తునకు సహకరిస్తామన్న అమెరికా, ఫైవ్‌ఐస్ దేశాలు కెనడాలో
పంజాబీ గ్యాంగ్‌స్టర్ హతం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: భారత్-కెనడా వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అటు కెనడా, ఇటు భారత్ ఆయా దేశాలకు తమవైపు వాదనలను వినిపిస్తున్నాయి. కెనడా నుంచి వచ్చే వారికి వీసాల మంజూరు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది. మరోవైపు, ఆరేళ్ల క్రితం పంజాబ్ నుంచి కెనడాకు పారిపోయిన కరడుగట్టిన నేరస్థుడు సుఖ్దూల్‌సింగ్ అక్కడ నేరముఠాల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో హతమయ్యాడు. విద్య, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్లిన భారతీయుల కుటుంబాలు తమ వారి భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కెనడాలో ఉన్న హిందువులూ అక్కడి ఖలిస్థానీ సంస్థల బెదిరింపులతో బిక్కుబిక్కుమంటున్నారు. కాగా, భారత్-కెనడా వివాదంపై పలుదేశాలు తాజాగా మరోమారు స్పందించాయి. హర్‌దీ్‌పసింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ కేసులో కెనడా పోలీసులు చేస్తున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని, భారత్ కూడా సహకరించాలని అమెరికా జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సమన్వయకర్త జాన్ కిర్బీ పేర్కొన్నారు. భారత్‌పై బహిరంగంగా ఆరోపణలు చేయటానికి ముందే ట్రూడో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రైవేటుగా మాట్లాడిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా, దౌత్యపరమైన సంభాషణలను వెల్లడించలేమని, అయితే, ట్రూడో చేసిన తీవ్రమైన ఆరోపణలను అధ్యక్షుడు (బైడెన్) తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారని కిర్బీ పేర్కొన్నారు. కెనడా, భారత్.. రెండూ తమకు భాగస్వామ్య దేశాలేనని చెప్పారు. బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ ట్వీట్ చేస్తూ, ‘అన్ని దేశాలూ సార్వభౌమత్వాన్ని, చట్టబద్ధ పాలనను గౌరవించాలి. కెనడాతో మేం సంప్రదింపుల్లో ఉన్నాం. దర్యాప్తు సవ్యంగా జరిగి, నేరస్థులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి అధికార ప్రతినిధి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ, ట్రూడో చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా తీసుకున్నామని, వాటి గురించి భారతదేశానికి చెందిన సీనియర్ అధికారుల ఎదుట ప్రస్తావించామని చెప్పారు. గతంలో ప్రధాని మోదీని ‘బాస్’ అని అభివర్ణించినందుకు ఇప్పుడు బాధపడుతున్నారా అని ఒక విలేకరి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ అల్బనీ్‌సను ప్రశ్నించగా, ఆ విలేకరిని ఉద్దేశించి మీరు కాస్త రిలాక్స్ కావాలి అని ఆయన పేర్కొన్నారు. న్యూజిలాండ్ విదేశాంగమంత్రి నానయా మహుతా.. ట్రూడో ఆరోపణలు నిజమే అని తేలితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు.
తిప్పి కొట్టే ప్రయత్నాల్లో భారత్
అంతర్జాతీయంగా తనపై ఒత్తిడి తేవటానికి కెనడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, భారత్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హర్‌దీ్‌పసింగ్ నిజ్జర్ హత్య కేసులో సాక్ష్యాధారాలను చూపిస్తే కెనడాకు సహకరించటానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలకు తెలియజేసినట్లు సమాచారం. భారత వ్యతిరేక ఉగ్రవాదులు, ఖలిస్థానీ వేర్పాటువాదులు కెనడాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గతంలో పలుమార్లు తెలియజేసినా కూడా ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమకు ఎన్నడూ సహకరించలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ, నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటి వరకూ కెనడా నుంచి నిర్దిష్టమైన వివరాలేమీ అందలేదని తెలిపారు. కెనడా గడ్డ మీది నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలను మాత్రం తాము ఆ దేశానికి అందజేశామని, కానీ, వారు ఏ చర్యలూ తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుత వివాదం వల్ల భారత్ ప్రతిష్ఠ మసకబారుతోందా అన్న ప్రశ్నకు బదులిస్తూ, ‘ఈ విషయంలో బాధపడే దేశం ఏదైనా ఉంటే కెనడానే. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, వ్యవస్థీకృత నేర మఠాలకు స్వర్గధామంగా ఆ దేశం తయారైంది. అంతర్జాతీయంగా తన పేరుప్రతిష్ఠల గురించి ఆలోచించుకోవాల్సింది కెనడానే. నేరస్థుల అప్పగింత కోసం ఇప్పటివరకూ 20-25 విజ్ఞప్తులు చేశాం. కానీ, కెనడా నుంచి సానుకూల స్పందనే లేదు’ అని బాగ్చీ దుయ్యబట్టారు. కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి బెదిరింపులు వస్తున్న దృష్ట్యా, వారు పని చేయలేకపోతున్నారని, ఈ నేపథ్యంలోనే కెనడా దేశస్థులకు ప్రస్తుతం భారత వీసాలు ఇచ్చే ప్రక్రియను నిలిపివేశామని బాగ్చీ తెలిపారు. ఇప్పటికే వీసాలు, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డు వంటివి ఉన్న వాళ్లు భారత్‌కు రావొచ్చని స్పష్టం చేశారు. మరోవైపు, కెనడాలో ఉన్న భారతీయ దౌత్యసిబ్బంది కంటే చాలా ఎక్కువ మంది కెనడా దౌత్యసిబ్బంది భారత్‌లో ఉన్నారని, ఆ సంఖ్యను సమానం చేస్తూ, అదనపు సిబ్బందిని వెనక్కి పంపించాలని కెనడాకు విదేశాంగశాఖ తెలిపింది. సంఖ్యాపరంగా, హోదాపరంగా సిబ్బంది సమానంగా ఉండాల్సిందేనని పేర్కొంది.
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
కెనడాతో వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ దేశంలో విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల గురించి వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివాదం త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ నుంచి అనేక మంది విద్య, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్తుంటారు. మరోవైపు, కెనడాలో ఉన్న భారతీయ హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ అక్కడి ఖలిస్థానీ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతుండటంతో, హిందువుల్లో అలజడి మొదలైంది. వారు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
భారత్‌పై ఒత్తిడికి ట్రూడో యత్నాలు ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన జీ 20 సమావేశాలకు ముందే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లతో కూడిన ‘ఫైవ్ ఐస్’ నిఘా వ్యవహారాల కూటమిని ట్రూడో సంప్రదించారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. నిజ్జర్ హత్యను ఖండిస్తూ ఫైవ్‌ఐస్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసేలా ఆయన తీవ్రంగా ప్రయత్నించారని, కానీ, జీ 20 సమావేశాలను భారత్ నిర్వహిస్తున్న దృష్ట్యా ఫైవ్‌ఐస్ దేశాలు దీనికి అంగీకరించలేదని తెలిపింది. అయితే, ప్రైవేటుగా జరిగిన చర్చల్లో పలు దేశాల అధికారులు భారత్‌తో ఈ విషయాన్ని గట్టిగానే ప్రస్తావించారని, జీ 20కి ముందే ఇది జరిగినట్లు వెల్లడించింది. నిజ్జర్ హత్యపై జరిగే దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలను ఫైవ్‌ఐస్ తరఫున ఉమ్మడి ప్రకటన రూపంలో ప్రకటించాలని కూడా ట్రూడో ప్రతిపాదించారని, దీనికి కూడా అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు కూడా నిరాకరించాయని వాషింగ్టన్‌పోస్ట్ తెలిపింది.
కెనడాలో గ్యాంగ్‌స్ట్టర్ హతం
పంజాబ్‌లో కరడుగట్టిన నేరస్థుడిగా ముద్రపడిన సుఖ్దూల్‌సింగ్ అలియాస్ సుఖా దునెకె కెనడాలో బుధవారం హతమయ్యాడు. నేర ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. సుఖ్దూల్‌సింగ్‌పై హత్య, హత్యాప్రయత్నం, దోపిడీ వంటి 18 కేసులు నమోదై ఉన్నాయి. పంజాబ్‌లోని దునెకా కలాన్ గ్రామానికి చెందిన సుఖ్దూల్ 2017 డిసెంబరులో కెనడాకు నకిలీ పాస్‌పోర్టుతో పారిపోయాడు. సుఖ్దూల్‌ను తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన ముఠా గురువారం ప్రకటించింది. బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జైల్లో ఉన్నాడు.
Updated Date - 2023-09-22T03:00:32+05:30 IST