PM Modi: టన్నెల్ కార్మికులతో మాట్లాడిన మోదీ.. వారి తెగువకు ప్రశంసలు
ABN, First Publish Date - 2023-11-29T10:37:36+05:30
ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు.
ఢిల్లీ: ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్ లో ముఖ్య పాత్ర పోషించిన ఆర్మీ(రిటైర్డ్) అధికారి వీకే సింగ్(VK Singh) సేవల్ని కొనియాడారు. పక్షం రోజులకు పైగా మొక్కవోని ధైర్యంతో ఆశలు కోల్పోకుండా నిరీక్షించి కార్మికుల తెగువను ప్రశంసించారు.
కార్మికులందరికీ కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆశీస్సులు ఉన్నాయని.. అందుకే క్షేమంగా బయటపడినట్లు వ్యాఖ్యానించారు. కూలీల అసాధారణ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఈ విషయంలో తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు.. కార్మికుల ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సొరంగంలో ఒక్క క్షణం కూడా తాము భయపడలేదని ఓ కార్మికుడు ప్రధానికి చెప్పాడు.
"మేమంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లమే కానీ అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. కలిసి భోజనం చేసేవాళ్లం. రాత్రి భోజనం అయ్యాక 2.5 కి.మీ సొరంగం లోపలికి నడిచివెళ్లేవాళ్లం. ఉదయం యోగా చేసేవాళ్లం" అని ఓ కార్మికుడు మోదీతో చెప్పాడు. ప్రధాని వీకేసింగ్ గురించి ప్రస్తావించగా.. ఆయన తమను బయటకి తీసుకురావడానికి చేసిన కృషిని కార్మికులు వివరించారు. "సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మా స్నేహితులు వారి కుటుంబాలను కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించింది. సవాళ్లు ఎదురైనప్పుడు వారి కుటుంబాలన్నీ చూపిన సహనం, ధైర్యాన్ని తప్పకుండా అభినందించాలి" అని ప్రధాని ఎక్స్‌లో రాశారు.
నిషేధించిన విధానమే కాపాడింది
అనేక మార్గాలు అనుసరించినా, ఆలోచించినా, ఉత్తరాఖండ్ సొరంగంలోని కూలీలను రెండు వారాలు బయటకు తీసుకురాలేకపోయారు. కానీ, ర్యాట్ హోల్ మైనింగ్(Rat Hole Mining)తో ఒక్క రోజులోపే ఫలితం వచ్చేసింది. వాస్తవానికి అశాస్త్రీయం, సురక్షితం కాదంటూ ఈ పద్ధతిపై 2014లో ఎన్జీటీ నిషేధం విధించింది. ర్యాట్ హోల్ మైనర్స్.. 4 అడుగుల వెడల్పు మించని ప్రదేశంలో బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో నిపుణులు. ఒక్కరు మాత్రమే పట్టే ఈ మార్గంలో బొగ్గు లేయర్‌ను చేరాక.. సొరంగం తవ్వడం ర్యాట్ హోల్ మైనర్స్ ప్రత్యేకత. ఇది ఎలుక తవ్వే కందకాన్ని పోలి ఉంటుంది కాబట్టి ర్యాట్ హోల్ అనే పేరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో పిల్లలతో ఈ పని చేయిస్తున్నారు. పర్యావరణ కోణంలోనూ దీనిని ఎన్జీటీ నిషేధించింది.
Updated Date - 2023-11-29T10:38:15+05:30 IST