Himanta Vs Gogoi: కోర్టులో కలుద్దాం: అసోం సీఎం, గొగోయ్ మధ్య మాటల యుద్ధం
ABN, First Publish Date - 2023-09-14T18:41:35+05:30
అసోం ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం గురువారంనాడు తారాస్థాయికి చేరింది. గొగోయ్ ఆరోపణలపై అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నానని, కోర్టులోనే ఆయనను కలుస్తానని తాజా ట్వీట్‌లో శర్మ పేర్కొన్నారు.
గౌహతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ (Himanta Biswa Sarma), లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) మధ్య తలెత్తిన మాటల యుద్ధం గురువారంనాడు తారాస్థాయికి చేరింది. ట్విటర్ వేదికగా ఈ ఇద్దరూ హోరాహోరీకి తలబడ్డారు. ముఖ్యమంత్రి శర్మ తన పరపతిని ఉపయోగించి ఆయన భార్య నడుపుతున్న సంస్థకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కింద రూ.10 కోట్లు ఇప్పించారంటూ గొగోయ్ సంచలన ఆరోపణ చేయడంతో ఈ ఇద్దరు అసోం నేతల మధ్య వివాదం రాజుకుంది. గొగోయ్ ఆరోపణలను శర్మ నిర్ద్వంద్వంగా ఖండించారు. దీనిపై అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నానని, కోర్టులోనే ఆయనను (గొగోయ్) కలుస్తానని తాజా ట్వీట్‌లో శర్మ పేర్కొన్నారు.
చాలా ఆగ్రహంతో ఉన్నా..
"అవును, నేను చాలా ఆగ్రహంతో ఉన్నాను. 2010 నుంచి మీ కుటుంబంపై అనేక కారణాల వల్ల ఆగ్రహంతో ఉన్నాను. మనం కోర్టులోనే మరోసారి కలవబోతున్నాం. నా వాదనను నేను నిరూపించుకుంటాను. 2016, 2021లో కూడా విజయవంతంగా నా వాదన వినిపించాను. మరోసారి అదే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇద్దరం ఇటు ప్రజాకోర్టులోనూ, అటు న్యాయస్థానంలోనూ కలుద్దాం'' అని శర్మ ట్వీట్ చేశారు.
మంచిదే...అలాగే కలుద్దాం..
శర్మ ట్వీట్‌కు గొగోయ్ వెంటనే స్పందించారు. ''మరీ అంత ఉద్రేకం తెచ్చుకోకండి. అసెంబ్లీకి మీరు రావాలని విపక్ష ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను మీకు పంపుతున్నాను. కోర్టుకు మీరు వెళ్తే నేను సంతోషిస్తాను. అప్పుడు అన్ని డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తాయి'' అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు.
లెక్చర్లు ఇవ్వొద్దు ...
గొగోయ్ ట్వీట్‌కు అంతే వేగంగా శర్మ తిరిగి ట్వీట్ చేశారు. తనకు లెక్చర్లు ఇవ్వొద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏం చేయాలో మీరు (గొగోయ్) నాకు చెప్పాల్సిన పని లేదని, అసెంబ్లీకి వెళ్లాలా, మీకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాలా అనే విషయంలో తాను సొంత నిర్ణయాలే తీసుకోగలనని శర్మ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి తన భార్యకు సొమ్ము అందినట్టు రుజువైతే ప్రజాజీవితం నుంచి రిటైర్ కావడంతో సహా ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-14T18:41:35+05:30 IST