భార్యకు భరణం ఇవ్వాలి.. నా కిడ్నీని కొంటారా?
ABN, First Publish Date - 2023-03-02T01:42:13+05:30
అతనో భార్యాబాధితుడు. ఇంకా చెప్పాలంటే భార్యతో పాటు అత్తామామలు, బావమరిది బాధితుడు కూడా. పెళ్లైనప్పటి నుంచి ఆరేళ్లుగా వాళ్లంతా అతన్ని వేధిస్తూనే ఉన్నారు.
పట్నా, మార్చి 1: అతనో భార్యాబాధితుడు. ఇంకా చెప్పాలంటే భార్యతో పాటు అత్తామామలు, బావమరిది బాధితుడు కూడా. పెళ్లైనప్పటి నుంచి ఆరేళ్లుగా వాళ్లంతా అతన్ని వేధిస్తూనే ఉన్నారు. వేధింపులు భరించలేక విడాకులు తీసుకుంటానంటే.. భార్య రూ.10 లక్షల భరణం అడుగుతోంది. కిడ్నీ అమ్ముకొనైనా సరే 10 లక్షలిచ్చి ఆ సాడిస్టు భార్యను వదిలించుకోవాలని భావించిన భర్త.. ‘‘కిడ్నీ అమ్మకానికి ఉంది ఎవరైనా కొంటారా’’ అంటూ బ్యానర్ చేతపట్టుకొని హరియాణాలోని ఫరీదాబాద్ రోడ్లపైన తిరుగుతున్నాడు. బిహార్ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. భార్య తరచూ అతనితో గొడవపడేది. బావమరిది, అత్తామామలు వేధించేవారు. పైగా అతనిపైనే వరకట్నం కేసు పెట్టారు. జైలుకు వెళ్లి బెయిలుపై ఇటీవలే బయటకు వచ్చిన సంజీవ్.. ఇక ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్నాడు. మార్చి 21లోపు తన కిడ్నీని ఎవరూ కొనకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సంజీవ్ బ్యానర్‌లో పేర్కొన్నాడు. పట్నాలో తన ఆత్మాహుతిని చూడటానికి రావాలంటూ.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ పేర్లను కూడా బ్యానర్‌పై రాశాడు. బ్యానర్‌కు మరోవైపున, తన భార్య, బావమరిది, అత్తామామల ఫొటోలు ముద్రించాడు. వేధింపులపై సాయం కోసం పోలీసులను, అధికారులను ఎన్నో సార్లు సంప్రదించానని, వార ఎలాంటి సాయం చేయకపోవడంతోనే బ్యానర్ పట్టుకు తిరుగుతున్నానని సంజీవ్ చెప్పాడు.
Updated Date - 2023-03-02T01:42:13+05:30 IST