Surabhi : వైఫల్యాన్ని గెలిచి... ప్రేరణగా నిలిచి...
ABN, Publish Date - Dec 18 , 2023 | 04:23 AM
పర్వతారోహకురాలు, పారాగ్లైడింగ్ పైలెట్, పర్యాటకురాలు, అన్వేషకురాలు... సురభీ ఛవ్డా గురించి ఇలాంటి విశేషాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా...
పర్వతారోహకురాలు, పారాగ్లైడింగ్ పైలెట్, పర్యాటకురాలు, అన్వేషకురాలు...
సురభీ ఛవ్డా గురించి ఇలాంటి విశేషాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు.
అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా...
కొత్తదారుల్లో నడిచి విజయం సాధించారు.
మోటివేషనల్ స్పీకర్‌గానూ తనదైన
ముద్రవేస్తున్న సురభి తన గురించి ఏం
చెబుతున్నారంటే...
‘‘మాది గుజరాత్‌లోని జునాగఢ్. మా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన గిర్నార్ పర్వతం ఉంది. దాన్ని చూస్తూ పెరిగిన నాకు పర్వతారోహణ మీద ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. మా నాన్నతో అడవుల్లోకి, పర్వతాలపైకి వెళ్ళేదాన్ని. వాటి గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు. ప్రకృతి సౌందర్యంతో మమేకం ఎలా అవ్వాలో ఆయన నుంచే నేర్చుకున్నాను. మౌంట్ అబూలోని ఒక మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన తరువాత... పర్వతారోహణ మీద నా ఆసక్తి మరింత పెరిగింది. బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్సు ద్వారా, పధ్నాలుగేళ్ళ వయసులో నా పర్వతారోహణ ప్రయాణం మొదలయింది. దానిలోని సాంకేతికమైన అంశాలన్నిటినీ అక్కడ తెలుసుకున్నాను. ఆ తరువాత అడ్వాన్స్ కోర్స్ చేశాను. రాక్ క్లైంబింగ్ ఇనస్ట్రక్టర్ హోదా సాధించాను.
దురదృష్టం వెంటాడింది...
సాధారణ పర్వతాలకూ, మంచు పర్వతాలకూ అధిరోహణ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మంచులో మన ముందు ఏముందనేది తెలీదు. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం తప్పదు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకుంటూనే... హిమాలయాల్లోని అనేక శిఖరాగ్రాల్ని అధిరోహించాను. ఆ తరువాత నా జీవిత ధ్యేయమైన ఎవరెస్ట్ అధిరోహణకు 2014లో సిద్ధమయ్యాను. సవాలుతో కూడుకున్న ఆ ప్రయాణం కోసం ఎంతో కష్టపడ్డాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ దురదృష్టం నన్ను వెంటాడింది. బాల్యం నుంచి నాకు ఉన్న ఒక సమస్యే దానికి కారణం. చిన్నప్పటి నుంచీ నా కళ్ళు బలహీనంగా ఉండేవి. దానివల్ల ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు... స్నో బ్లయిండ్‌నె్‌సకు గురయ్యాను. దాంతో రెండు, మూడు రోజుల పాటు క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది భావోద్వేగపరంగా నామీద ప్రభావం చూపించింది. శారీరకంగానూ బలహీనమైపోయాను. 7,400 మీటర్ల ఎత్తువరకూ చేరుకున్నాక... వెనక్కి తిరిగి పోవాలనే క్లిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అది నన్ను ఎంతో నిరాశకు గురిచేసింది. నా కలలన్నీ కుప్పకూలిపోయినట్టనిపించింది. దేనికోసమైతే అన్ని ప్రయత్నాలు చేశానో... అది నెరవేరలేదనే ఆవేదన వెంటాడింది. ఆ బాధ నుంచి బయటపడడానికి పారాగ్లైడింగ్ వైపు దృష్టి మళ్ళించాను. హిమాచల్‌ప్రదేశ్‌లోని బిర్‌కు వెళ్ళి శిక్షణ తీసుకున్నాను. 2017 నుంచి ‘భారత పారాగ్లైడింగ్ సంఘం’లో సభ్యురాలుగా ఉన్నాను. దేశంలోని అనేక ప్రాంతాల్లో పారాగ్లైడింగ్ చెయ్యడమే కాదు... చాలామందికి శిక్షణ ఇస్తున్నాను. అగ్రశ్రేణి పారాగ్లైడర్స్‌లో ఒకరుగా గుర్తింపు పొందాను.
ఆ ఉత్సాహం ఎప్పుడూ ఉంటుంది...
వివిధ ప్రదేశాల్లో పర్యటించడం అంటే నాకెంతో ఇష్టం. అలాగే ట్రెక్కింగ్ కోసం కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ ఉంటాను. ఔత్సాహిక పర్వతారోహకుల కోసం టూర్స్ కూడా నిర్వహిస్తున్నాను. అయితే ఇంకా నాలో ఏదో వెలితి మాత్రం కొనసాగుతూ వచ్చింది. మనం జీవితంలో ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. వాటిని సాధించడానికి ఎంతో కష్టపడతాం. కానీ ప్రతిసారీ అనుకున్నది నెరవేరకపోవచ్చు. దానివల్ల తీవ్రమైన నైరాశ్యం కలుగుతుంది. ఈ సమస్యను నేనూ ఎదుర్కొన్నాను. వేరే యాక్టివిటీ్‌సలో నిమగ్నం కావడం ద్వారా దాని నుంచి బయటపడ్డాను. ఇలాంటి పరిస్థితులు ఎందరికో ఎదురవుతూ ఉంటాయి. వారికి ధైర్యం చెప్పి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు ప్రేరణ కలిగిస్తే బాగుంటుందనిపించింది. అందుకే ‘మోటివేషనల్ స్పీకర్’గా మారాను. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. వివిధ సంస్థలు, పాఠశాలలు, స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్స్ నన్ను ఆహ్వానిస్తున్నాయి. పారాగ్లైడింగ్‌లో, మౌంటెనీరింగ్‌లో శిక్షణ, టూర్స్ నిర్వహణతో బిజీగా ఉన్నా... జీవితం పట్ల అస్పష్టత, ఆందోళన ఉన్నవారిలో స్ఫూర్తి నింపాలనే ఉత్సాహం ఎప్పుడూ ఉంటుంది. నా మాటలు వారిలో కొందరి జీవితాలనైనా మారుస్తాయనే ఆలోచన నాలోనూ ఉత్సాహం కలిగిస్తుంది.’’
Updated Date - Dec 18 , 2023 | 04:23 AM