ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Action Mela : వెండితెరపై యాక్షన్‌ మేళా

ABN, First Publish Date - 2023-08-27T04:03:17+05:30

భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. పాటలు, ఫైట్లు, హీరోయిజం ఇది మాత్రమే సినిమా కాదని, అంతకు మించి ఎన్నో ఉన్నాయని కొత్త పాఠాలు నేర్పుతోంది. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచ సినిమా మొత్తం ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంది. సినిమా విషయంలో మారుతున్న పోకడలు,

భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. పాటలు, ఫైట్లు, హీరోయిజం ఇది మాత్రమే సినిమా కాదని, అంతకు మించి ఎన్నో ఉన్నాయని కొత్త పాఠాలు నేర్పుతోంది. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచ సినిమా మొత్తం ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంది. సినిమా విషయంలో మారుతున్న పోకడలు, వైఖరులు, అభిరుచులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. దాంతో ప్రజాదరణ పొందేలా సినిమా తీయడం ఈ రోజుల్లో కత్తి మీద సాములా తయారవుతోంది. పాటైనా, యాక్షన్‌ అయినా ఇది వరకటిలా ఫార్ములాలో పొసగడం లేదు. వాటినీ కొత్తగా చూపించాల్సిందే. ముఖ్యంగా పోరాట ఘట్టాలకు మరింత పెద్ద పీట వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి తగ్గట్టే దర్శక నిర్మాతలు, ఫైట్‌ మాస్టర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వెరసి వెండి తెరపై కొత్త తరహా పోరాట ఘట్టాలు చూసే వీలు దక్కుతోంది.

ఫైట్‌ అనేది ఓ ఎమోషన్‌. అదో వ్యాపార సూత్రం. వెండి తెరపై హీరో.. ప్రత్యర్థుల్ని చితగ్గొడుతుంటే.. థియేటర్లు మార్మోగిపోతుంటాయి. ఒక్కో దర్శకుడు.. ఈ యాక్షన్‌ సీన్‌ ని ఒక్కోలా డిజైన్‌ చేస్తుంటాడు. సినిమాలో ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండాల్సిందే అని ఓతరం నమ్మేది. ఇప్పుడు సంఖ్య ముఖ్యం కాదు. రెండే ఫైట్లున్నా.. వాటిని స్టైలీష్‌గా, రోమాంఛితంగా తెరకెక్కించడంపైనే దృష్టి పెడుతున్నారు. కొన్ని సినిమాలు కేవలం యాక్షన్‌కే పెద్ద పీట వేస్తున్నాయి. అలాంటి చిత్రాలు ఈ సీజన్‌లో ఎక్కువగా రాబోతున్నాయి.

బోయపాటి సినిమా అంటే యాక్షన్‌ తో దద్దరిల్లాల్సిందే. హింస, రక్తపాతాన్ని కూడా అందరికీ నచ్చేలా డిజైన్‌ చేస్తారాయన. సింహా, లెంజెండ్‌, సరైనోడు, అఖండ.. వీటిలో యాక్షన్‌దే సింహభాగం. ఇప్పుడు రామ్‌తో ‘స్కంద’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులోనూ పోరాట ఘట్టాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. యాక్షన్‌ కంటే ఎక్కువగా ఎలివేషన్లపై దృష్టి పెట్టే బోయపాటి.. ఈసారి గత సినిమాలకు మించిన మసాలా దట్టించినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌ కి సైతం యాక్షన్‌ చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే ఈ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి.

మల్లయుద్దంలా హీరో, విలన్లు బాహాబాహీ తలపడడం ఒక ఎత్తు. స్టైల్‌గా గన్నులతో కాల్చుకోవడం మరో ఎత్తు. స్టైలీష్‌ సినిమాలకు ఇప్పుడు మరింత గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ సత్తారు ఓ స్టైలీష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. అదే.. గాంఢీవధారి అర్జున. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఈసారి పోరాటఘట్టాలకు ప్రాధాన్యం ఉన్న కథనే ఎంచుకొన్నాడు. అదే... ఆది కేశవ. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇటీవలే టీజర్‌ వచ్చింది. ఆ టీజర్‌ చూస్తుంటే ఈ కథలో ఫైట్స్‌కి పెద్ద పీట వేసినట్టు అర్థం అవుతోంది. ఓ గుడిని కాపాడే క్రమంలో భాగంగా హీరో చేసే పోరాటాలు ఆకట్టుకొంటాయని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా హిట్టయితే వైష్ణవ్‌కి మాస్‌ ఇమేజ్‌ వచ్చినట్టే.


ఇక సలార్‌ విషయానికొద్దాం. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ యాక్షన్‌ సన్నివేశాల్ని డిజైన్‌ చేయడంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కేజీఎఫ్‌ రెండు భాగాల్లోనూ యాక్షన్‌కి ఆయన పెద్ద పీట వేసిన విధానం ఆకట్టుకొంది. ఫైట్‌ కంటే.. దాని ముందు వచ్చే ఎలివేషన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ప్రభాస్‌ లాంటి కటౌట్‌ దొరికితే ప్రశాంత్‌ నీల్‌ ఊరుకొంటాడా? సలార్‌ లో వచ్చే ఫైట్స్‌ మాస్‌కు ఓ సెలబ్రేషన్‌లా ఉండబోతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ఓ చిన్న టీజర్‌ చూస్తే చాలు. ప్రభాస్‌కి ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చాడో అర్థం అవుతుంది. కేవలం యాక్షన్‌ పార్ట్‌కే దాదాపు సగం రోజులు కేటాయించినట్టు సమాచారం. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులే కాదు, యాక్షన్‌ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబరులో రాబోతున్న టైగర్‌ నాగేశ్వరరావు కూడా ఓ యాక్షన్‌ డ్రామానే. రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించారు. పాన్‌ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే యాక్షన్‌ కి పెద్ద పీట వేయాల్సిందే. ఈ కథ కూడా అలాంటిదే. ముఖ్యంగా ట్రైన్‌ దోపిడీ నేపథ్యంలో వచ్చే పోరాటఘట్టం మాస్‌కి విపరీతంగా నచ్చుతుందని, మిగిలిన ఫైట్స్‌ కూడా ఆకట్టుకొంటాయని చిత్రబృందం చెబుతోంది.

వెంకటేశ్‌- శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సైంధవ్‌’. ఈ యేడాది డిసెంబరులో విడుదల కానుంది. రివైంజ్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. వెంకటేశ్‌ పాత్ర కొత్త కోణంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందులోనూ యాక్షన్‌ కే సింహభాగం కేటాయించారు. వెంకీకి ఫ్యామిలీ ఇమేజ్‌ ఉంది. అయితే అప్పుడప్పుడూ తను మాస్‌ పాత్రలు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ సినిమా ఓకే చేశారు. ఈ సినిమాలో శైలేష్‌ వెంకీని చూపించిన విధానం ఆకట్టుకొంటుందని, విశ్రాంతికి ముందొచ్చే యాక్షన్‌ సీన్‌, క్లైమాక్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది.

‘‘పాట కోసం పాట.. ఫైటు కోసం ఫైటు అనే రెగ్యులర్‌ పోకడలో సినిమాలు తీస్తే కష్టం. ఎంత పెద్ద ఫైట్‌ అయినా, అందులో ఎంత పెద్ద హీరో ఉన్నా.. కథలో భాగంగా వచ్చినప్పుడే రక్తి కడుతుంది. కేవలం మాస్‌ ని టార్గెట్‌ చేసి యాక్షన్‌ సన్నివేశాలు రూపొందిస్తే జనం హర్షించరు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అంటున్నారు. మిగిలిన దర్శకులూ.. ఇలానే ఆలోచిస్తే వెండి తెరపై సరికొత్త యాక్షన్‌ ఘట్టాల్ని చూసే అవకాశం దక్కుతుంది.

Updated Date - 2023-08-27T04:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising