Hanuma : సుందర హనుమ
ABN, First Publish Date - 2023-05-12T00:05:45+05:30
‘ సుందరుడు’ అంటే అర్థం ‘అందగాడు’ అని మాత్రమే కాదు. ‘సుతరాం ఆద్రియతే ఇతి సుందరః’ అని వ్యుత్పత్తి. ‘అందరినీ ఆకర్షించేవాడు. అందరి ఆదరణ పొందేవాడు’ అని విశ్లేషణ.
‘ సుందరుడు’ అంటే అర్థం ‘అందగాడు’ అని మాత్రమే కాదు. ‘సుతరాం ఆద్రియతే ఇతి సుందరః’ అని వ్యుత్పత్తి. ‘అందరినీ ఆకర్షించేవాడు. అందరి ఆదరణ పొందేవాడు’ అని విశ్లేషణ. శ్రీమద్రామాయణ కథ విన్నవారినీ, చదివినవారినే కాదు... సాక్షాత్తూ సీతారాములతో సహా అందరినీ ఆకట్టుకున్న ఒకే ఒక్కడు... హనుమంతుడు. నాడే కాదు, నేటికీ అందరికీ ప్రీతిపాత్రుడు. ఆ సుందరుని కథే... రామాయణంలోని సుందరకాండ.
రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి మహర్షి... ఆయా సందర్భాలను అనుసరించి ఒక్కొక్క కాండకూ ఒక్కొక్క పేరు పెట్టాడు. కిష్కింద కాండ, యుద్ధ కాండ మధ్యన ఉన్నది– సుందరకాండ. అది ఒక్కటే కథా సందర్భాన్ని అనుసరించి పెట్టిన పేరు కాకపోవడం విశేషం. ఈ కాండలో ప్రధానంగా ముగ్గురు పాత్రధారులు. ముగ్గురూ సుందరులే! సీత త్రిలోక జనని. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి. త్రిలోక సుందరి. శ్రీరాముడు లోకాతీత సౌందర్యం కలిగినవాడు. పురుషులను కూడా మోహింపజేసే సౌందర్యం ఆయనది. హనుమ సౌందర్యాన్ని గురించి ముందే ప్రస్తావించుకున్నాం. పైగా ఈ కాండలో ఎక్కడా యుద్ధాలు లేవు. మరణాలు లేవు. ప్రకృతిపరంగా అంతా సౌందర్యమే, ఆహ్లాదమే. అటువంటి సుందరకాండలో ప్రధానపాత్ర హనుమంతుడిది. చలనచిత్ర పరిభాషలో చెప్పాలంటే... ప్రతి ఫ్రేమ్‌లోనూ హనుమంతుడి దర్శనమే.
హనుమంతుడిభవ్యమైన చరిత్రను వ్యాసుని తండ్రి పరాశరుడు ‘పరాశర సంహిత’ పేరుతో రచించాడు. రామచరిత్రకు రామాయణం, కృష్ణ చరిత్రకు భాగవతం మాదిరిగా... వాటి సరసన నిలువదగిన హనుమంతుడి చరిత్ర... పరాశర సంహిత. కిష్కిందకాండలో హనుమంతుడి ప్రవేశంతో రామాయణం అందమైన మలుపులు తిరుగుతుంది. కథకు నూతనోత్తేజం సమకూరుతుంది. ‘హనుమ’ అనే శబ్దానికి ‘జ్ఞానవంతుడు’ అనేది ఒక అర్థం. సూర్యుడి శిష్యునిగా సకల వేదాలనూ, వ్యాకరణాన్నీ అభ్యసించిన వ్యాకరణవేత్తగా... రాముడంతటి వాడితో ‘నూనం వ్యాకరణ కృత్స్నం అనేక బహుధా శృతం’... ‘‘ఏమి మాట్లాడుతున్నాడయ్యా ఇతను! నాలుగు వేదాలనూ, వ్యాకరణాన్నీ ఆపోశన పట్టాడు’’ అని ప్రశంసలను అందుకున్నాడు హనుమంతుడు. ఆయన గురించి రాయాలంటే మరో పరాశరుడు భువికి రావాలంటారు పండితులు.
వేనవేల రావణులను దునుమాడగల బలవంతుడు, శౌర్య మూర్తి, సుగ్రీవ సచివుడైన హనుమంతుడు... శ్రీరాముణ్ణి విస్మయపరచిన కావ్యకోవిదుడు. విభీషణ శరణాగతి సందర్భంలో ఆయన ప్రదర్శించిన రాజనీతిజ్ఞత అనన్య సామాన్యం. ఎంతటి బలసంపన్నుడైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలిగే ధీరుడైనా ‘దాసోహం కోసలేంద్రస్య’ అంటూ ‘రామునిమీద భారం ఉంచి కార్యం నిర్వర్తిస్తున్నాను’ అని చాటి చెప్పిన రామభక్త శిఖామణి. వారధి లంఘించినప్పుడు రామబాణంలా దూసుకుపోతానన్నాడు కానీ... తన శక్తి సామర్థ్యాలే కారణమని చెప్పలేదు. రుద్ర తేజుడైనప్పటికీ ప్రశాంత గాంభీర్యం, ఉగ్రతేజుడైనా మృదు మధుర వాక్కులు పలికే సంస్కారవంతుడు. బలాన్ని ప్రదర్శించాల్సిన వేళ... బుద్ధి చతురత ప్రదర్శించి, పరిస్థితులను చక్కదిద్దినవాడు. నిస్వార్థ కర్మయోగి.
శ్రీరాముని దూతగా రామాయణంలో హనుమంతుడు మూడుసార్లు దర్శనమిస్తాడు. అవి: సీతమ్మను కలిసి, తన మృదుమధుర వాక్కులతో రామ కథను వినిపించి, ఆమెకు రాముని అంగుళీకాన్నీ, శ్రీరాముడికి సీన ఇచ్చిన చూడామణినీ అందజేసి, శ్రీరాముని పరిష్వంగాన్ని పొందిన మధురమైన ఘట్టం. రెండోది... రామునికి ఇచ్చిన మాట మరచి, అంతఃపురంలో సతులతో విహరిస్తున్న సుగ్రీవుణ్ణి హెచ్చరించి, మత్తు వదిలించిన సందర్భం. మూడోది, లంకాధిపతి రావణుణ్ణి సందర్శించి, తనను తాను పరిచయం చేసుకొని, పరకాంతను వాంఛించడం శ్రేయస్కరం కాదనీ, మహాలక్ష్మి అంశ అయిన సీతామాతను శ్రీరాముని వద్దకు సగౌరవంగా పంపించి, శరణాగతుడివి కావాలనీ వివేక బోధ చేసిన ఘట్టం. అన్ని చోట్లా తన ప్రత్యేకతను చాటుకున్న వాక్చతురుడు హనుమంతుడు.
అంజనాసుతుడైన హనుమంతుడు భక్తులపాలిట కల్పవృక్షం. వజ్రాంగబలి (భజరంగబలి)గా భక్తులను అనుగ్రహిస్తాడు. సర్వదేవాత్మకుడైన హనుమను ప్రధానంగా కీర్తించే రామాయణంలోని ‘సుందరకాండ’నూ, తులసీదాస కృతమైన ‘హనుమాన్ చాలీసా’నూ పారాయణ చేస్తే... ఆయన ఆశీస్సు లభించి, అభీష్టాలన్నీ సిద్ధిస్తాయన్నది పెద్దలమాట.
శ్రీరామదూతం శిరసానమామి.
• ఆయపిళ్ల రాజపాప
Updated Date - 2023-05-12T00:05:45+05:30 IST