Sweat Blisters : చెమట పొక్కులకు చక్కని చిట్కాలు
ABN, First Publish Date - 2023-03-09T02:18:30+05:30
వేసవిలో చెమటను భరించటమే కష్టం. దీనికి చెమట పొక్కులు తోడైతే ఇక ఆ చిరాకును మాటల్లో చెప్పలేం. ఈ చెమట పొక్కులు మంట పెట్టకుండా
వేసవిలో చెమటను భరించటమే కష్టం. దీనికి చెమట పొక్కులు తోడైతే ఇక ఆ చిరాకును మాటల్లో చెప్పలేం. ఈ చెమట పొక్కులు మంట పెట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
మెత్తగా పొడి చేసిన ఓట్‌మీల్‌ను చల్లని నీళ్లతో నింపిన బాత్‌టబ్‌లో వేసి కలపాలి. నీళ్లు పాల రంగులోకి మారాక బాత్‌టబ్‌లో 30 నిమిషాలు సేదతీరాలి. తర్వాత మెత్తని టవల్‌తో తడి అద్దు కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చెమట పొక్కులు వదులుతాయి.
క్లాత్‌లో ఐస్‌క్యూబ్స్ మూటగట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి చేస్తూ ఉంటే 3 రోజులకి చెమట పొక్కులు మరింత పాకకుండా తగ్గిపోతాయి.
గంధం పొడి, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలిపి సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.
ఒక కప్పు చల్లని నీళ్లలో ఒక టీస్పూను బేకింగ్ సోడా కలిపి వాష్‌క్లాత్‌ను నానబెట్టి పిండేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద 10 నిమిషాలు ఉంచినా ఉపశమనం కలుగుతుంది.
ముల్తాని మట్టికి రోజ్‌వాటర్ చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద అప్లై చేసి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.
లేత వేప ఆకుల్ని మెత్తగా నూరి అప్లై చేసి ఆరాక చల్లని నీటితో కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.
వేప ముద్దకు అర కప్పు శనగపిండి, కొద్దిగా నీరు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని అప్లై చేసి ఆరాక కడిగేసుకోవాలి.
చెమట పొక్కులు రాకుండా ఉండాలంటే తరచుగా చల్లనీళ్లతో ఒంటిని కడుగుతూ ఉండాలి.
పుచ్చకాయ గుజ్జును పూసి ఆరాక కడిగేసుకోవాలి.
కర్పూరాన్ని పొడి చేసి తగినంత వేప నూనె చేర్చి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
రోజుకో గ్లాసు చెరుకు రసం తాగినా చెమట పొక్కులు రాకుండా ఉంటాయి.
కలబంద గుజ్జును అప్లై చేసినా ఉపశమనం కలుగుతుంది.
Updated Date - 2023-03-09T02:18:30+05:30 IST