ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CEO Sudharani Mullapudi : ఆ కళ మళ్లీ రావాలని..!

ABN, First Publish Date - 2023-01-29T23:53:46+05:30

మహిళా కళాకారులకు మెరుగైన ఆదాయం కోసం కృషి చేయడం ద్వారా అంతరించిపోయే కళలను ఆదరిస్తున్నారు అభిహార సామాజిక సంస్థ సిఇఒ సుధారాణి ముళ్లపూడి, ఐఎఎస్‌సిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా కళాకారులకు మెరుగైన ఆదాయం కోసం కృషి చేయడం ద్వారా అంతరించిపోయే కళలను ఆదరిస్తున్నారు అభిహార సామాజిక సంస్థ సిఇఒ సుధారాణి ముళ్లపూడి, ఐఎఎస్‌సిసి కో-ఫౌండర్‌ చిత్ర సూద్‌. వాళ్లిద్దరూ తమ కళా ప్రయాణాన్ని ‘నవ్య’తో పంచుకున్నారిలా....

కొండపల్లి బొమ్మలకు ఆదరణ పెరుగుతోంది

కొవిడ్‌ తర్వాత చేతివృత్తుల ఉనికి ప్రమాదంలో పడిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణాలకు తరలిపోవడం వల్ల కూడా చేతివృత్తులు క్రమేపీ అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. వాటన్నింటికీ పూర్వ వైభవాన్ని కల్పించడం కోసం నేనూ, సుధ కలిసి పని చేస్తున్నాం. గత ఐదేళ్లుగా మేం కళాకారులకు జీవనోపాధిని కల్పిస్తూ, సహజ రంగుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మరీ ముఖ్యంగా మహిళలకు చేతి వృత్తుల పట్ల శిక్షణను అందించి, స్వయంస్వావలంబన దిశగా వారిని నడిపించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం సుధ ఆధ్వర్యంలోని అభిహారకు మా సంస్థ ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ ఛాయుసెస్‌’ (ఐఎఎ్‌ససిసి) ద్వారా సహాయ సహకారాలను అందిస్తున్నా. నిధులు లేకపోతే వ్యాపారం దిగజారుతుంది అనే భయం లేకుండా, మహిళా కళాకారులకు ఒక బిజినెస్‌ మోడల్‌ను రూపొందించి, శిక్షణ తర్వాత మార్కెటింగ్‌ మెలకువలు నేర్పించడంతో పాటు, వనరుల సమీకరణల గురించి నేర్పించడం మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ క్రమంలో గత మూడేళ్లుగా సహజరంగుల వాడకాన్ని, ఒకటిన్నర సంవత్సరాలుగా కొండపల్లి బొమ్మల తయారీలో మహిళలకు కళానైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అనుసరిస్తున్నాం. అయితే సంక్రాంతి, దసనా బొమ్మల కొలువు సమయంలోనే కొండపల్లి బొమ్మలకు డిమాండ్‌ ఎక్కువ. మిగతా సమయాల్లో వాటి కొనుగోళ్లు అంతగా ఉండవు. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడం కోసం కార్పొరేట్‌ గిఫ్టింగ్‌, యుటిలిటీ ఐటమ్స్‌ తయారీల వైపు కళాకారులను నడిపించాం. ప్రస్తుతం సహజరంగులతో కూడిన కొండపల్లి బొమ్మలకు లాంకొ కంపెనీ నుంచి పెద్ద ఆర్డర్లు అందుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన హ్యాండిక్రాఫ్ట్‌ కార్పొరేషన్లైన లేపాక్షి, గోల్కొండల నుంచి ఆర్డర్లు అందుతున్నాయి. చెన్నై దగ్గరున్న దక్షిణచిత్ర కూడా దశావతారాల్లాంటి బొమ్మలను తయారుచేసి అందించమని అడుగుతోంది. నైపుణ్యాన్ని పెంపొందిస్తే, ఏ కళాకారులైనా వాళ్లంతట వాళ్లు తమ కాళ్ల మీద నిలబడగలుగుతారు అనడానికి కొండపల్లి బొమ్మల కళాకారుల విజయమే ఒక ఉదాహరణ.

మహిళల సాధికారతే లక్ష్యం

చేనేత, చేతివృత్తుల రంగాల్లో మహిళా కళాకారుల శ్రమకు గుర్తింపు తక్కువ. వారికి నైపుణ్యాలు కూడా తక్కువే! ఉదాహరణకు మగ్గం పని ప్రధానంగా పురుషుల ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి చేనేత కళాకారులనగానే ఎవరికైనా పురుషులే స్ఫురిస్తారు. కానీ రంగులు, డిజైన్లు అద్దే మహిళా కళాకారులకు పురుషులతో సమాన గుర్తింపు దక్కదు. ఫలితంగా మహిళా కళాకారుల పనికి గుర్తింపు, ఆదాయం రెండూ తక్కువగానే ఉంటూ ఉంటాయి. అలాగే ప్రభుత్వం ప్రోత్సహాలకు కూడా మహిళలు దూరమైపోతున్నారు. కాబట్టి మహిళలకు నైపుణ్యాల శిక్షణ, సామర్ధ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాం. అలా పత్తి రైతులు మొదలు, చేనేత, చేతివృత్తుల్లో ఉన్న మహిళా కళాకారుల వరకూ వారి ఆదాయం మెరుగయ్యే మార్గాల మీదే మేం దృష్టి పెట్టాం. ఆ క్రమంలో 2016లో అభిహారను స్థాపించాం. ఐఎఎ్‌ససిసి కో-ఫౌండర్‌ చిత్ర సూద్‌ సహాయంతో ఈ పనులను ప్రణాళికాబద్ధమైన శిక్షణా కార్యక్రమాలను రూపొందించాను. మహిళా కళాకారుల సుస్థిరమైన జీవనోపాధికి అవసరమైన అంశాలను మహిళా కళాకారులతో ప్రత్యక్ష సంప్రతింపులు జరిపి తెలుసుకున్నాం.

మహిళలకు కళానైపుణ్యం

కాలక్రమేణా చేనేత, చేతివృత్తుల రంగాల్లో పురుషులు వారి వృత్తుల్ని వదిలేసి వెళ్లిపోతున్న పరిస్థితి. ఇందుకు కారణం ఆయా వృత్తుల్లో సరిపడా ఆదాయం, గుర్తింపు లేకపోవడమే! ఫలితంగా ఆయా వారసత్వ వృత్తులు, కళానైపుణ్యాలు అంతరించిపోకుండా ముందుకు కొనసాగించవలసిన బాధ్యతను మహిళలు తలకెత్తుకుంటున్నారు. అయితే ఆయా వృత్తులు తిరిగి పునర్వైభవాన్ని పొందాలంటే, అనుభవజ్ఞులైన పురుషులు అలవరుచుకున్న కళా నైపుణ్యాలను మహిళలు కూడా అలవరుచుకోవాలి. అందుకోసం కొండపల్లిలోని కళాకారులను కలిసి, ఆ కళానైపుణ్యంలో అనుభవమున్న వ్యక్తులకు తగిన వేతనాలు అందించి, మహిళలకు వాటిని నేర్పించే ఏర్పాట్లు చేశాం. కొండపల్లిలో కేవలం 40 కళా కుటుండాలే మిగిలాయి. మిగతా వాళ్లందరూ వేర్వేరు జీవనోపాధులకు మరలిపోయారు. అయితే అదృష్టవశాత్తూ, తనతో ఆ కళ అంతరించిపోకూడదనే సదుద్దేశం కలిగి ఉన్న కొండపల్లిలో కోటయ్య చారి గారు మహిళలకు కళానైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అలాగే వారి ఉత్పత్తులకు మేం మార్కెటింగ్‌ సదుపాయాలను కూడా కల్పించాం. అక్కడ వర్క్‌షా్‌పలు ఏర్పాటు చేసి, బొమ్మల తయారీకి అవసరమైన ముడిసరుకును అందించి, స్టైఫండ్‌ ఇస్తూ వారిని పోత్రహించాం. అలా ఆరు నెలల పాటు శిక్షణనిచ్చి, అక్కడే క్రాఫ్ట్‌ స్టోర్‌ నెలకొల్పడానికి తోడ్పడ్డాం.

సహజ రంగులను ప్రోత్సహిస్తూ...

ఎన్నో ఏళ్ల నుంచి కొండపల్లి బొమ్మలకు రసాయన రంగులైన ఆక్రిలిక్‌ పెయింట్స్‌ వేయడం పరిపాటిగా మారింది. నిజానికి ముందు తరం వాళ్లు సహజ రంగులను ఉపయోగించారు. కరక్కాయ, పారిజాతం, కొబ్బరిపీచు, దానిమ్మ, బంతిపూలు, మోదుగుపూలు, మంజిష్ఠ, అనపకాయ ఆకు మొదలైన వాటితో సహజ రంగులు ఉత్పత్తి అయ్యేవి. ఆక్రిలిక్‌ లాంటి రంగులను బొమ్మలకు అద్దేది మహిళలే కాబట్టి ఆ రంగుల ప్రభావం మహిళల మీద పడుతోంది. కాబట్టి పర్యావరణ హితం కోసం, మహిళల సురక్షితమైన ఆరోగ్యం కోసం మేం సహజరంగుల వాడకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. చేనేతలో కూడా సహజ రంగులను ప్రోత్సహిస్తున్నాం. సిద్ధిపేట, బొబ్బిలి, చీరాల, మంగళగిరి, ఈ నాలుగు చేనేతల్లో సహజరంగులను ప్రవేశపెడుతున్నాం. కొండపల్లిలో రెండు కుటుంబాలతో మొదలుపెట్టి 15 కుటుంబాలను సహజరంగుల వైపు మళ్లించగలిగాం.

పుట్టింది తమిళనాడులోని మదురై. చదువు మదురై నుంచి కొత్తగూడెం వరకు వేర్వేరు ప్రదేశాల్లో కొనసాగింది. అంతిమంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ఐదేళ్ల క్రితం ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ ఛాయుసెస్‌’ (ఐఎఎ్‌ససిసి)ను స్థాపించాను. ఇదొక లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ. ఈ సంస్థలోని సగ భాగం ఆర్థిక పరిశోధన, నాణ్యతా పరిశోధన కోసం పని చేస్తే, మిగతా సగ భాగం దాతృత్వ కార్యక్రమాల కోసం పని చేస్తుంది.

- చిత్ర సూద్‌ ఐఎఎస్‌సిసి కో-ఫౌండర్‌

Updated Date - 2023-01-29T23:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising