Nandini : శభాష్ నందిని..!
ABN, First Publish Date - 2023-12-09T03:50:38+05:30
19 ఏళ్ల అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారు? చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు.. స్నేహితులతో బయటకు వెళ్లి
19 ఏళ్ల అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారు? చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు.. స్నేహితులతో బయటకు వెళ్లి ఆనందంగా గడపాలనుకుంటారు.. కానీ మధ్యప్రదేశ్‌లోని నందినీ అగర్వాల్ మాత్రం ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అతి చిన్న వయస్సులో సీఏ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
‘‘నేను ఇంటర్ చదువుతున్న సమయంలో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన ఒక వ్యక్తి మా స్కూలుకు వచ్చారు. పిల్లలను కలిసారు. ఎందుకో ఆ సంఘటన నాపై చెరగని ముద్ర వేసింది. నేను కూడా ఒక రికార్డు సాధించాలనుకున్నా. ఆ రికార్డు బద్దలు కొట్టడం అంత సులభం కాకూడదు’’ అంటారు నందిని. ఇంటర్ అయిపోయిన వెంటనే నందిని సీఏ చేయటానికి అవసరమైన పరీక్షలు రాశారు. అయితే ఆమెకు అప్రెంటీ్‌సషిప్ ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘‘నేను సీఏ చేయటానికి సిద్ధంగా ఉన్నానంటే ఎవరూ నమ్మేవారు కాదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి.. అనేవారు. పెద్ద కంపెనీల్లో కష్టమని.. చిన్నవాటిలో చేరటానికి ప్రయత్నించా. అయినా ఎవరూ ఒప్పుకోలేదు. దీనితో అప్రెంటీ్‌సషిప్ చేయటం కష్టం అయింది’’ అని నందిని తన అనుభవాలను పంచుకుంటుంది. అయితే ఇలాంటి అనుభవాలే తనను మానసికంగా బలోపేతం చేశాయని.. గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యం చేరుకొనేలా చేశాయంటారు.
అన్నతో అనుబంధం..
నందిని సోదరుడి పేరు సచిన్. నందిని కన్నా రెండేళ్లు పెద్ద. అయితే నందిని రెండు క్లాసులు త్వరగా చదివేయటం వల్ల - వారిద్దరూ కలిసే చదివేవారు. సచిన్ కూడా నందినితో పాటుగానే సీఏకి ప్రిపేర్ అయ్యాడు. ఈ పరీక్షకు 83వేల మంది హాజరయ్యారు. దీనిలో నందినికి మొదటి స్థానం లభిస్తే- సచిన్‌కు 568వ స్థానం లభించింది. చాలా ఇళ్లల్లో పిల్లల మధ్య కొంత పోటీ ఉంటుంది. అయితే తమ మధ్య అలాంటి పోటీ లేదంటారు నందిని. ‘‘వాస్తవానికి నా విజయంలో మా అన్నయ్య పాత్ర చాలా ఉంది. ప్రాక్టీసు టెస్ట్‌లు చేసే సమయంలో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చేవి. ప్రాక్టీసు టెస్ట్‌ల్లోనే తక్కువ మార్కులు వస్తే- నిజమైన పరీక్షల్లో నా పరిస్థితి ఏమిటని భయమేసేది. ఆ సమయంలో అన్నయ్య నాకు అండగా నిలిచేవాడు. ప్రాక్టీసు టెస్ట్‌లకు నిజమైన పరీక్షలకు సంబంధం లేదని చెప్పేవాడు. నాకు అండగా నిలిచేవాడు’’ అని అన్నయ్య గురించి నందిని చెబుతారు. సచిన్ కూడా నందిని తనకు ఒక స్ఫూర్తిగా నిలిచిందంటారు. ‘‘తనను చూసి నేను పరీక్షక్షలకు ప్రిపేర్ కావటం మొదలుపెట్టా. ఒక విధంగా చూస్తే తనే నాకు స్ఫూర్తి’’ అంటారు సచిన్.
Updated Date - 2023-12-09T03:50:47+05:30 IST