ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narayanapet MLA Interview : గెలిచాను కదా.! అని రిలాక్స్‌ అవ్వట్లేదు...

ABN, First Publish Date - 2023-12-11T00:17:02+05:30

డాక్టర్‌ చిట్టెం పర్ణికా రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి... మొన్నటి వరకు ఒక వైద్య విద్యార్థిని మాత్రమే. ఇప్పుడు ఆమె నారాయణపేట ప్రజాప్రతినిధి కూడా. పాలకుర్తి ఎమ్మెల్యే

డాక్టర్‌ చిట్టెం పర్ణికా రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే

డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి... మొన్నటి వరకు ఒక వైద్య విద్యార్థిని మాత్రమే.

ఇప్పుడు ఆమె నారాయణపేట ప్రజాప్రతినిధి కూడా. పాలకుర్తి ఎమ్మెల్యే

మామిడాల యశస్విని రెడ్డి... తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టిన

పిన్న వయస్కురాలు. వీరందరూ 30ఏళ్లలోపు వారే.!

పైగా ఒకరు డాక్టరు అయితే మరొకరు ఇంజనీరు. ఆయా నియోజకవర్గాల నుంచి

ప్రాతినిధ్యం వహిస్తోన్న తొలి మహిళా శాసనసభ్యులు కావడం మరొక విశేషం.

ప్రజాక్షేత్రంలో నిలిచి, గెలిచి అసెంబ్లీలో అడుగు

పెట్టిన ఈ యువ నేతలను ‘నవ్య’ పలకరించింది.

అసెంబ్లీలో అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యాను. అప్పుడు నాలో కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. స్పీకర్‌ పోడియం వైపు చూడగానే మా తాతయ్య మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గారు గుర్తొచ్చారు. ఒకనాడు అదే సీట్లో కూర్చొని ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన నాటి దృశ్యాలు కళ్ల ముందు మెదిలాయి. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నా, నేను రాజకీయాల్లోకి వస్తానని ఎన్నడూ అనుకోలేదు. శాసనసభకు ఎన్నికవుతానని అస్సలు ఊహించలేదు. ఒక వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలి అనుకున్న నాకు, ఇప్పుడు ఓ ఎమ్మెల్యేగా సమాజానికి మరింత మంచి చేసే అవకాశం వచ్చింది. దీన్ని నూటికి నూరుపాళ్లు సద్వినియోగించుకుంటా.! మా ప్రాంత అభివృద్థి కోసం శ్రమిస్తాను.

మెడికల్‌ ప్రాక్టీసు వదలను

ఎమ్మెల్యే అయ్యాను కదా.! అని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రస్తుతం రేడియాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాను. నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన ముందు రోజు వరకు కూడా కాలేజీలోనే ఉన్నాను. ఎన్నికల ప్రచార సమయంలోనూ రోజుకు కనీసం ఒక గంట అయినా అకడమిక్‌ పుస్తకాలు చదవకుండా లేను. మరో ఆరునెలల్లో నా చదువు పూర్తి అవుతుంది. తర్వాత కూడా వైద్యురాలిగా ప్రాక్టీసు చేస్తూనే, ప్రజాప్రతినిధిగా సేవలందిస్తాను. చట్టసభలో నా గొంతు వినిపిస్తాను. అప్పుడే నన్ను నమ్మిన నా ప్రాంత ప్రజలకు పూర్తి న్యాయం చేయగలను. నా భర్త విశ్వజిత్‌రెడ్డి యూరాలజిస్టు. ఇద్దరం కలిసి నారాయణపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలి అనుకొంటున్నాం. మాకు ఒక బాబు. ఇప్పుడు వాడి వయసు నాలుగేళ్లు. తల్లిగా బాబు ఆలనాపాలనా చూడటం కూడా ముఖ్యమే. చదువుతో పాటు ఆటల్లోనూ ముందున్నాను. జాతీయ స్థాయిలో స్కేటింగ్‌, రాష్ట్ర స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీల్లోనూ పాల్గొన్నాను.

అమ్మ అనుభవం తోడైతే...

మా తాతయ్య, నాన్న దూరమైన నాటికి నాకు 11ఏళ్లు. ఇంటికి పెద్ద మనుమరాలిని కావడం వల్లనేమో, తాతయ్యకు నేనంటే చాలా ఇష్టం. ఇక నాన్నకు అయితే ప్రాణం. నన్ను డాక్టరుగా చూడాలి అన్నది వాళ్లిద్దరి కోరిక. ఆ ప్రకారమే నేను మెడిసిన్‌ చదివాను. మా అమ్మ లక్ష్మి ఐఏఎస్‌ అధికారిణి.మరొక తాతయ్య (మాతా మహుడు) కుంభం పుల్లారెడ్డి కూడా ఐఏఎ్‌సగా సేవలందించారు. అయితే, మొదటి నుంచి నాకు సివిల్స్‌ వైపు ఆసక్తి లేదు. పరిపాలనా విభాగంలో అమ్మకు అపారమైన అనుభవం ఉంది. కనుక అమ్మ గైడెన్స్‌ తప్పనిసరిగా తీసుకొంటాను. తద్వారా మరింత బాగా పరిపాలన అందిచవచ్చు కదా. నా తమ్ముడు అభిజయ్‌ రెడ్డి, మా మేనమామ కుంభం శివకుమార్‌ రెడ్డి ల సపోర్టు నాకు కొండంత బలం. ప్రజాక్షేత్రంలో నాకు వాళ్లే వెన్నుదన్ను. వారి సహకారంతో నియోజకవర్గ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళతాను. మా నాన్న మరణానంతరం, ఆయన సేవా స్ఫూర్తిని మామయ్య కొనసాగించారు. మా నాన్న వెంకటేశ్వర్‌ రెడ్డిలాగే మామయ్య కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ, స్థానికులకు తలలో నాలుకలా మెలిగారు. నిజానికి నా స్థానంలో మా శివకుమార్‌ రెడ్డి మామ పోటీ చేయాల్సింది. ‘యువతను ప్రోత్సహించాలి’ అనే ఉద్దేశంతో తనకు వచ్చిన అవకాశాన్ని ఆయన నాకు ఇచ్చారు. పదిహేనేళ్లుగా మా మామయ్య నిత్యం స్థానికులతో మమేకమవుతూ, ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. అవన్నీ నా గెలుపునకు దోహదపడ్డాయి.

మాట నిలబెట్టుకుంటా...

తాతయ్య, నాన్న, మామయ్య... వీళ్లంతా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజానాయకుల్లా పనిచేయడం చూస్తూ పెరిగాను. కనుక ప్రజాక్షేత్రం నాకు కొత్తేమీకాదు. ఎన్నికల ప్రచార సమయంలో... చాలా గ్రామాల్లో కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను గుర్తించాను. ముఖ్యంగా సాగునీటి కొరత తీర్చడం నా ముందున్న తక్షణ కర్తవ్యం. మా పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు అవినీతి రహిత పాలన అందిస్తానని అఫిడవిట్‌లో సంతకం చేశాను. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొంటాను. చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా మహబూబ్‌నగర్‌ వెళ్లాల్సిన పరిస్థితి. ఏరియా ఆస్పత్రి స్థితి అయితే మరీ అధ్వానం. కనుక నా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవడం నా ముందున్న మరొక ముఖ్య కర్తవ్యం. ‘గెలిచాం కదా.! ఇక రిలాక్స్‌ అవుదాం’ అనుకోవడం లేదు. తిరిగి ప్రతి గ్రామానికి వెళతాను. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను.

రోగుల ప్రాణాలను కాపాడే వైద్యురాలిగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా, భావి పౌరుడిగా తీర్చిదిద్దే ఓ తల్లిగా... ఈ బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తించగలను.

Updated Date - 2023-12-11T00:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising