ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అండాలను దాచుకోవచ్చు

ABN, Publish Date - Dec 19 , 2023 | 03:52 AM

కానీ జీవిత లక్ష్యాలు, అనారోగ్యాలు, ఊహించని పరిణామాలు... ఇలా మాతృత్వాన్ని వాయిదా వేయక తప్పని పరిస్థితులను ఎందరో మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు.

తల్లి కావాలని ప్రతి మహిళా కోరుకుంటుంది.

కానీ జీవిత లక్ష్యాలు, అనారోగ్యాలు, ఊహించని పరిణామాలు... ఇలా మాతృత్వాన్ని వాయిదా వేయక తప్పని పరిస్థితులను ఎందరో మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి మహిళల కోసం ఉద్దేశించినదే

‘ఎగ్‌ బ్యాంకింగ్‌’. ఈ ప్రక్రియ గురించిన మరింత ఆసక్తికరమైన విషయాలు ఇవి!

పుట్టుకతో వెంట పెట్టుకొచ్చే అండాలు, వాటి నాణ్యత... పెరిగే వయసుతో పాటు తరిగిపోతూ ఉంటాయనే విషయం మహిళలందరికీ తెలిసిందే! కాబట్టే 30 ఏళ్లలోపే తొలి బిడ్డకు జన్మనిస్తున్నారు. కానీ ఇలా అందరికీ వీలు పడకపోవచ్చు. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదగాలని తపన పడే మహిళలుంటారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో గర్భం దాల్చలేని వాళ్లుంటారు. తగిన జీవిత భాగస్వామి దొరికే వరకూ పెళ్లిని వాయిదా వేసే వాళ్లుంటారు. వీళ్లందరూ అండాల నాణ్యత చెక్కుచెదరకుండా ఉండేలా వాటిని భద్రంగా నిల్వ చేసి ఉంచే ఎగ్‌ ఫ్రీజింగ్‌ను ఎంచుకోవచ్చు.

నిల్వ ఎందుకంటే?

మహిళల్లో 45 ఏళ్ల వరకూ నెలసరి కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి నెలసరితో ఒక్కొక్క అండం విడుదలైపోతూ ఉంటుంది. కాబట్టి ఒక వయసుకు చేరుకునేటప్పటికి అండాలు మిగలవు. దాంతో నెలసరి కూడా ఆగిపోతుంది. మహిళల పునరుత్పత్తి వ్యవస్థ పరిస్థితి ఇది. 20 ఏళ్లు మొదలు 30 ఏళ్ల వరకూ మహిళల్లో అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాటి సంఖ్య, నాణ్యతలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ వయసు మహిళల్లో సేకరించిన అండాలతో మున్ముందు గర్భం దాల్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆ వయసులో అండాలను సేకరించి దాచుకోవడం ఉత్తమం. అయితే ఇలా పుట్టుకతో వెంట తెచ్చుకున్న అండాల నాణ్యతను చికిత్స కొంత మేరకు పెంచుకునే వెసులుబాటు ఉంది కానీ, తరిగిపోయిన అండాల నిల్వలను పెంచుకునే అవకాశం లేదు. కాబట్టే ఎగ్‌ ఫ్రీజింగ్‌ అనే సౌలభ్యం అందుబాటుల.ోకి వచ్చింది. అయితే దీన్లో రెండు రకాలుంటాయి. ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా కెరీర్‌, వ్యక్తిగత అంశాలతో గర్భధారణను వాయిదా వేయడం కోసం అండాలను నిల్వ చేసుకునే విధానం సోషల్‌ ఎగ్‌ ఫ్రీజింగ్‌. తీవ్రమైన వ్యాధుల కారణంగా గర్భధారణను వాయిదా వేయడం కోసం అండాలను నిల్వ చేసుకునే విధానాన్ని మెడికల్‌ ఇగ్‌ ఫ్రీజింగ్‌ అంటారు. కేన్సర్‌ లాంటి వ్యాధుల చికిత్స వల్ల అండాశయాలు దెబ్బ తింటాయి. కాబట్టి చికిత్స పూర్తయిన తర్వాత ముందుగా ఫ్రీజ్‌ చేసుకున్న అండాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు. అలాగే టర్నర్‌ సిండ్రోమ్‌ లాంటి క్రోమోజోమల్‌ అవకతవకలు ఉన్నవాళ్లలో 35 ఏళ్లకే నెలసరి ఆగిపోతుంది. వీళ్లు ముందుగానే అండాలను సేకరించి నిల్వ చేయించుకోవచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్‌ సమస్య ఉన్న మహిళల్లోని అండాశయాల్లో సిస్ట్‌లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్య పెళ్లి కాని అమ్మాయిల్లో తలెత్తితే ఒవేరియన్‌ టిష్యూ డ్యామేజ్‌ అవుతుంది. కాబట్టి సర్జరీకి ముందు అండాలను సేకరించి నిల్వ చేసుకుంటే మున్ముందు గర్భధారణకు ఎటువంటి సమస్యా ఉండదు. కొందరు మహిళల్లో అండాల రిజర్వ్‌ ఎంతో తక్కువగా ఉంటుంది. వీళ్లు కూడా ముందుగానే అండాలను సేకరించి నిల్వ చేసుకోవడం ఉత్తమం.

ఒవేరియన్‌ రిజర్వ్‌ టెస్టింగ్‌

ఎన్ని అండాలు ఉన్నాయి? ఈ ప్రక్రియ విజయావకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అనే అంశాలను తెలుసుకోవడం చేసే పరీక్ష ఇది. దీంతో పాటు రక్తపరీక్ష, అలా్ట్రసౌండ్‌ స్కాన్‌ చేసి, ఆ నెలకు సదరు మహిళలో ఎన్ని అండాలున్నాయో తెలుసుకోవచ్చు. సదరు మహిళ వయసు, బిఎమ్‌ఐ, ఎగ్‌ రిజర్వ్‌ల ఆధారంగా అండాల సంఖ్యను గమనించి, ఇవ్వవలసిన హార్మోన్‌ ఇంజెక్షన్ల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. సాధారణంగా నెలకు ఒక అండం విడుదలవుతూ ఉంటుంది. అలా విడుదలయ్యే అండాల సంఖ్యను పెంచడానికి ఈ హార్మోన్‌ ఇంజక్షన్లు ఉపయోగపడతాయి. 8 నుంచి 10 రోజుల పాటు ప్రతి రోజూ ఇచ్చే ఈ ఇంజెక్షన్‌ల వల్ల అండాల సంఖ్య పెరుగుతుంది. అండాలు పరిణతి చెందాయని నిర్థారించుకున్న తర్వాత, స్వల్ప అనస్థీషియా ద్వారా ఇంటర్నల్‌ స్కాన్‌ చేసిన విధంగానే వైద్యులు అండాలను సేకరిస్తారు. 30 నిమిషాల వ్యవధితో కూడిన ఈ ప్రొసిజర్‌ ద్వారా అండాలను సేకరించిన తర్వాత, వాటి నాణ్యతను పరిశీలించి అదే రోజు ఫ్రీజ్‌ చేస్తారు.

నాణ్యత చెక్కుచెదరకుండా...

అండాల నిల్వ గురించి ఎన్నో అపోహలున్నాయి. తాపమానాన్ని నిర్దిష్ట పరిధికి తగ్గించి, అదే తాపమానాన్ని కొనసాగిస్తూ, అండాలను నిల్వ చేయడం జరుగుతుంది. ఇలాంటి తాపమానాల్లో ఏళ్ల తరబడి అండాలను నిల్వ చేసుకోవడం వల్ల వాటి నాణ్యత తగ్గిపోతుందనీ, అండాలు దెబ్బ తింటాయనే అపోహలున్నాయి. కానీ ఇది నిజం కాదు. అండాలు సేకరించి నిల్వ చేసినప్పుడు, ఆ అండం బయలాజికల్‌ యాక్టివిటీ అక్కడితో ఆగిపోతుంది. సేకరించిన సమయంలో అవెంత నాణ్యంగా ఉంటాయో, ఏళ్ల తరబడి నిల్వ చేసి, తిరిగి సంగ్రహించేటప్పుడు కూడా అంతే నాణ్యంగా ఉంటాయి. ఇలా అండాలను ఐదు నుంచి పదేళ్ల పాటు నిల్వ చేసుకోవచ్చు.

ఐవిఎఫ్‌ ద్వారానే...

గర్భం దాల్చాలి అనుకున్నప్పుడు నిల్వ చేసిన అండాలను నేరుగా శరీరంలోకి ఇంజెక్ట్‌ చేయడమనేది ఉండదు. నిల్వ చేసుకున్న అండాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చి, స్పెర్మ్‌తో ఫలదీకరించి, ఎంబ్రియోను గర్భాశయంలో ఇంప్లాంట్‌ చేయవలసి ఉంటుంది. అయితే గర్భధారణకు గర్భాశయాన్ని సిద్ధం చేయడం కోసం, గర్భాశయం లోపలి పొరను మెరుగు పరుచుకోవడం కోసం ఐవిఎఫ్‌కు మూడు రోజుల ముందు నుంచీ మందులు తీసుకోవలసి ఉంటుంది. ఇలా ఎంబ్రియోను ట్రాన్స్‌ఫర్‌ చేసిన తర్వాత, 14 రోజులకు రక్త పరీక్ష ద్వారా గర్భధారణను నిర్థారించుకోవచ్చు. అయితే ఇలా గర్భం దాల్చడానికి కూడా వయో పరిమితి ఉంటుంది. వయసుతో పాటు శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫలితాలు మెరుగ్గా ఉండడం కోసం 35 నుంచి 38 ఏళ్ల లోపు గర్భం దాల్చడం అవసరం. ఆ వయసు పైబడితే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు అప్పటికే మొదలై ఉంటాయి. అలాగే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌, గర్భాశయ లోపలి పొర మందులకు స్పందించకపోవడం లాంటి సమస్యలు రావచ్చు. గర్భస్రావాల సమస్య కూడా ఉంటుంది.

తొలి మూడు నెలలు కీలకం

సాధారణ గర్భం మాదిరిగానే, నిల్వ చేసిన అండంతో ఐవిఎఫ్‌ ద్వారా గర్భం దాల్చిన తర్వాత మొదటి మూడు నెలలు ఎంతో కీలకమైనవి. సహజసిద్ధంగా కాకుండా బయట ఫలదీకరించి శరీరంలో ప్రవేశపెట్టే అండం కాబట్టి, గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు హార్మోన్‌ ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్లు అవసరం ఉంటుంది. మూడు నెలల తర్వాత ప్లాసెంటా ఫార్మేషన్‌ పూర్తవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఆటంకాలూ ఉండవు. ఒకవేళ అబార్షన్లు అయ్యే తత్వం కలిగి ఉంటే అదనపు మందులు కూడా అవసరమవుతాయి. ఇలా గర్భం దాల్చిన మహిళలు పూర్తిగా విశ్రాంతికి పరిమితం కావలసిన అవసరం లేదు. రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. మొదటి త్రైమాసికంలో బ్లీడింగ్‌ కనిపించిన వాళ్లు మాత్రం బెడ్‌ రెస్ట్‌ తీసుకోవలసిన అవసరం ఉంటుంది.

నార్మల్‌ డెలివరీ సాధ్యమే!

ఐవిఎఫ్‌ ద్వారా గర్భం దాల్చినంత మాత్రాన కచ్చితంగా సిజేరియన్‌ చేయించుకోవలసిందే అనేది అపోహ మాత్రమే! వీళ్లు కూడా సాధారణ ప్రసవం ద్వారా బిడ్డను కనే వీలుంది. ప్రసవ నొప్పులు భరించలేని మహిళలు, ఇంత ఖర్చు పెట్టి, రిస్క్‌ తీసుకోవడమెందుకు అని భావించేవాళ్లు సాధారణంగా సిజేరియన్‌నే ఎంచుకుంటూ ఉంటారు. కానీ వద్దనుకునే మహిళలు, సాధారణ ప్రసవానికి తగిన శరీర నిర్మాణం కలిగిన మహిళలు సాధారణ ప్రసవం ద్వారా బిడ్డను కనే వీలుంది.

ఎంత ఖర్చు?

అండాల సంఖ్య, నిల్వ చేసే సమయాల మీద ప్రిజర్వేషన్‌ ఖర్చు ఆధారపడి ఉంటుంది. 9 అండాల వరకూ సేకరించి, వాటిని ఏడాది పాటు నిల్వ చేసుకోవాలనుకుంటే అందుకయ్యే ఖర్చు సుమారుగా పాతిక నుంచి 30 వేల వరకూ ఉంటుంది. దీనికి అండాల సేకరణ, ఐవిఎఫ్‌ ఇంప్లాంటేషన్‌ ఖర్చులు అదనం.

Updated Date - Dec 19 , 2023 | 03:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising