ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Geetika Kodali : అమెరికా క్రికెట్‌ జట్టుకు మనమ్మాయే సారథి

ABN, First Publish Date - 2023-02-20T00:49:34+05:30

ఏ ఆటలో పట్టుందో తెలియాలంటే ఆటలన్నీ ప్రయత్నించాలి. అలా అంతిమంగా క్రికెట్‌లో తనకు ప్రావీణ్యం ఉన్నట్టు గ్రహించిన గీతికా కొడాలి, ఏకంగా అమెరికా అండర్‌ 19 క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ ఆటలో పట్టుందో తెలియాలంటే ఆటలన్నీ ప్రయత్నించాలి. అలా అంతిమంగా క్రికెట్‌లో తనకు ప్రావీణ్యం ఉన్నట్టు గ్రహించిన గీతికా కొడాలి, ఏకంగా అమెరికా అండర్‌ 19 క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఎదిగిపోయింది. బ్యాట్‌ చేత పడితే, సెంచరీకి తగ్గకుండా రన్‌ రేట్‌ సాధించే ఆ 18 ఏళ్ల ఆల్‌రౌండర్‌, నవ్యతో పంచుకున్న క్రికెట్‌ ప్రస్థానమిది.

మా ఊరు విజయవాడ. మా నాన్నగారు ప్రశాంత్‌ కొడాలి, 1999లో అమెరికా వెళ్లారు. పెళ్లి తర్వాత అమ్మ మాధవి కొడాలి కూడా అమెరికా వెళ్లిపోయింది. 2004లో నేను క్యాలిఫోర్నియాలో పుట్టాను.

నేను పుట్టిందీ పెరిగిందీ అమెరికాలోనే. చిన్నప్పటి నుంచీ నాకు క్రీడలంటే ఇష్టం. సాకర్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, స్విమ్మింగ్‌ ఇలా సీజన్‌ సీజన్‌కూ నా ఆటలను మార్చేస్తూ ఉండేదాన్ని. అలా పదకొండవ ఏట, క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టాను. అయితే అంతకు ముందు వరకూ ఆ క్రీడను అమెరికాలో ప్రొషెషనల్‌గా ఆడతారనే విషయం నాకు తెలియదు. తెలిసిన తర్వాత, ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. అలా క్రికెట్‌లో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను. ఆ ఆటకే అంకితమైపోయాను. అయితే యుఎస్‌ఎ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. ఫ్లోరిడాలో అమెరికా మహిళా క్రికెటర్లు, పాకిస్తానీ మహిళా క్రికెటర్లతో ఒక టోర్నమెంటు ఆడారు. ఆ ఆటను చూస్తున్నప్పుడు, ఏదో ఒకరోజు అమెరికా కోసం ఆడాలి అని బలంగా నిర్ణయించుకున్నాను. అయితే అప్పటికి మా స్కూళ్లలో క్రికెట్‌ ఉండేది కాదు. దాంతో నేను క్రికెట్‌ జీల్‌ అకాడమీ అనే క్లబ్‌లో చేరిపోయి, ఆట మీద పట్టు పెంచుకున్నాను. ఆ అకాడమీ కోచ్‌ అమెరికా జాతీయ మహిళా క్రికెట్‌ బృందానికి హెడ్‌ కోచ్‌గా ఉండేవాడు. మొదట ఆయన దగ్గరే నేను క్రికెట్‌లో శిక్షణ పొందాను.

14వ ఏటలోనే ఎంపికై...

నేను అండర్‌ 19 టీమ్‌లో కూడా ఆడాను. 2019లో, 14 ఏళ్ల వయసులోనే యుఎస్‌ ఉమెన్స్‌ టీమ్‌లో ఎంపికయ్యాను. ఐసిసి ఉమెన్స్‌ వరల్డ్‌ టి20 క్లాలిఫయర్‌లో మా టీమ్‌, కెనడా టీమ్‌తో పోటీ పడింది. అదే నా క్రికెట్‌ కెరీర్‌లో మొట్టమొదటి అధికారిక ఆట. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, తాజాగా అమెరికా అండర్‌ 19 మహిళా క్రికెట్‌ బృందానికి కెప్టెన్‌గా ఎంపికయ్యాను. జనవరి 14 నుంచి జనవరి చివరి వరకూ దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌ 19 టోర్నమెంటులో అమెరికాకు ప్రాతినిధ్యం వహించాను. అమెరికా క్రికెట్‌ బృందంలో అమెరికా పౌరులే కాకుండా, హెచ్‌1 హోల్డర్లు కూడా ఆడవచ్చు. అంటే అమెరికాలో నిరంతరంగా మూడేళ్ల పాటు నివసించిన ఎవరైనా టీమ్‌లో పాలుపంచుకోవచ్చు. ప్రస్తుత యుఎస్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ కెప్టెన్‌ సింధు శ్రీహర్ష కూడా హెచ్‌1 హోల్డరే! నా బృందంలో ఒకరిద్దరు మినహా మిగతా సభ్యులందరూ అమెరికాలో పుట్టి, పెరిగినవాళ్లే!

విజయ పరంపర సాగిందిలా...

2022 ప్రారంభంలో అండర్‌ 19 ప్రిపరేషన్‌ టోర్నమెంట్‌ కోసం మా క్రికెట్‌ బృందం, వెస్టిండీస్‌లోని ఒక భాగమైన సెయింట్‌ విన్సెంట్‌ అనే ఒక దీవికి చేరుకుంది. అక్కడ విన్‌వర్డ్‌ ఐల్యాండ్‌తో ఆడిన ఆ టోర్నమెంట్‌ను మేం గెలుచుకోగలిగాం. అదే ఏడాది జులైలో ట్రినిడాడ్‌ మా క్రికెట్‌ బృందాన్ని ఆహ్వానించింది. ట్రినిడాడ్‌ కూడా వెస్టిండీస్‌లో భాగమే! వాళ్లు రైజింగ్‌ స్టార్స్‌ అనే టోర్నమెంటును ఏర్పాటుచేశారు. ఆ టోర్నమెంటులో వెస్టిండీస్‌కు చెందిన ఐదు వేర్వేరు దీవులు పాల్గొన్నాయి. వాటితో మా యుఎస్‌ టీమ్‌ తలపడి, అన్ని టీముల మీదా గెలుపు సాధించింది. అలా రైజింగ్‌ స్టార్స్‌ ఛాంపియన్లుగా గుర్తింపు సాధించాం. ఆ తర్వాత వెస్టిండీస్‌ తన ఐదు టీముల నుంచి ఒక బృందాన్ని రూపొందించి, ఇంకొక సిరీస్‌ కోసం అమెరికాకు పంపించింది. దాన్లో కూడా అమెరికా బృందం నాలుగు ఆటల్లో నెగ్గింది. తర్వాత నవంబరులో మా అండర్‌ 19 టీమ్‌ దుబాయ్‌లో ఒక సిరీస్‌ ఆడి, 3:2తో గెలుపు సాఽధించింది. ఈ సిరీస్‌లో పాల్గొన్న మా యుఎస్‌ క్రికెట్‌ బృందానికి నేనే కెప్టెన్‌గా సారధ్యం వహించాను. ప్రపంచ కప్‌లో సైతం మంచి రన్‌ రేట్‌ సాధించాను. నా స్టైక్‌ రేట్‌ ఎప్పుడూ వంద శాతానికి పైగానే ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్‌...

ఈ ఏడాది టోర్నమెంట్లు ఎక్కువగా ఉండడంతో, ఆన్‌లైన్‌లోనే చదువును కొనసాగిస్తున్నాను. క్యాలిఫోర్నియాలో ఉన్నప్పుడు టోర్నమెంట్ల కోసం బడి మానేస్తే, తిరిగి బడికి వెళ్లే సమయానికి హోమ్‌వర్క్‌ అంతా పూర్తి చేయవలసి వచ్చేది. అలా కాకుండా చదువు విషయంలో రిలాక్స్‌డ్‌గా ఉంటే, క్రికెట్‌ మీద నేను మరింత ఏకాగ్రత కేటాయించ గలుగుతాననే ఉద్దేశంతో, నా తొమ్మిదో తరగతిలో అమ్మా నాన్నా క్యాలిఫోర్నియా నుంచి నార్త్‌ కెరోలినాలోని కేరీ అనే నగరానికి మారిపోయారు. అలా అప్పటి నుంచి నా చదువంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. ప్రస్తుతం నేను ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. కేరీ నగరంలో క్రికెట్‌ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. అక్కడ కాళీచరణ్‌ గారి దగ్గర క్రికెట్‌ శిక్షణ తీసుకున్నాను. గత ఏడాది నుంచి రోహన్‌ గోశాల క్రికెట్‌లో నాకు సహాయ పడుతున్నారు.

ఫుడ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఇలా...

క్రికెట్‌ శారీరక శ్రమతో కూడుకున్న ఆట కాబట్టి ప్రొటీన్‌ ఎక్కువగా, కార్బ్స్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉంటాను. బటర్‌ నాన్‌, పన్నీర్‌ టిక్కా మసాలా లాంటి ఇండియన్‌ వంటకాలంటే ఇష్టం. అలాగే నాకు చాట్‌ కూడా చాలా ఇష్టం. అలాగే నాకెంతో ఇష్టమైన తీపి పదార్థాలకు కొద్దిగా దూరంగా ఉంటూ ఉంటాను. ఖాళీ సమయాల్లో టివి చూడడం, స్నేహితులతో గడపడమంటే నాకు చాలా ఇష్టం. వారంలో మూడు నాలుగుసార్లు జిమ్‌కు వెళ్తూ ఉంటాను. వెయిట్‌ ట్రైనింగ్‌ సాధన చేస్తూ ఉంటాను. అలాగే రన్నింగ్‌ కూడా చేస్తాను. భవిష్యత్తులో నాకు ఉమెన్స్‌ లీగ్‌లో లేదా డబ్లుబిబిఎల్‌లో ఆడాలని ఉంది. నా క్రికెట్‌ ఆటకు మా తల్లితండ్రుల తోడ్పాటు ఎంతో ఉంది. నేను ఆట కోసం ఏ దేశానికి వెళ్లినా, వాళ్లు కూడా నాతో పాటు వచ్చి, ప్రోత్సహిస్తూ ఉంటారు.

గోగుమళ్ల కవిత.

Updated Date - 2023-02-20T00:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising